ఆ సమయంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ వద్దన్నాడు: గంగూలీ

  • గతంలో కెప్టెన్సీ కోల్పోయిన కోహ్లీ
  • కోహ్లీ స్థానంలో జట్టు పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ
  • నాటి సంగతులు పంచుకున్న గంగూలీ
గతంలో టీమిండియా సారథిగా వ్యవహరించిన విరాట్ కోహ్లీ అవాంఛనీయ పరిస్థితుల నేపథ్యంలో కెప్టెన్సీ కోల్పోయాడు. ఫామ్ లో లేకపోవడం, కీలక టోర్నీల్లో టీమిండియా ఓటములు, సెలెక్టర్ల నమ్మకం కోల్పోవడం వంటి కారణాలు కోహ్లీకి కెప్టెన్సీని దూరం చేశాయి. 

కోహ్లీ తర్వాత టీమిండియా కెప్టెన్ గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బాధ్యతలు అందుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు సొంతగడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో అద్భుత రీతిలో ఆడుతోంది. ఈ నేపథ్యంలో, గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించిన క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. 

నాడు టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరన్న చర్చ వచ్చినప్పుడు, సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు రోహిత్ శర్మ వెనుకంజ వేశాడని తెలిపాడు. అన్ని ఫార్మాట్లలో ఆడడం అనేది ఒత్తిడితో కూడుకున్న విషయం అని, దాంతో కెప్టెన్సీకి న్యాయం చేయలేనని అతడు భావించాడని గంగూలీ వివరించాడు. 

"అయితే ఓ కార్యక్రమంలో రోహిత్ శర్మతో కరాఖండీగా చెప్పేశాను. బోర్డు ప్రతిపాదనకు నువ్వు సరే అనాల్సిందే... లేకపోతే టీమిండియా కెప్టెన్ గా నీ పేరును నేనే ప్రకటిస్తాను అని స్పష్టంగా వెల్లడించాను. నా సంతోషం కొద్దీ రోహిత్ శర్మ అందుకు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం అతడి నాయకత్వం ఏ స్థాయిలో ఉందో అందరూ చూస్తున్నారు. వరల్డ్ కప్ లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు... అందుకు టీమిండియా సాధించిన విజయాలే నిదర్శనం" అని గంగూలీ వివరించాడు.


More Telugu News