పాకిస్థాన్ లో పాస్ పోర్టుల జారీలో కొత్త సమస్య

  • లామినేషన్ పేపర్ కొరతతో పాస్‌పోర్టుల తయారీలో జాప్యం
  • పాస్‌పోర్టు లేక విదేశాలకు వెళ్లానుకునే వారు ఇక్కట్ల పాలు
  • ప్రభుత్వం చేతకానితనానికి తామెందుకు బాధపడాలంటూ ఆవేదన
పాక్ ప్రజలు మరో వింత సమస్యతో సతమతమవుతున్నారు. లామినేషన్ పేపర్ల కొరతతో పాస్‌‌పోర్టుల జారీలో జాప్యం జరుగుతుండటంతో విదేశాలకు వెళ్లానుకునే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పేపర్ ఫ్రాన్స్‌ నుంచి దిగుమతి అవుతుందని అక్కడి మీడియా చెబుతోంది. పేపర్ కొరత దేశవ్యాప్తంగా ఉందని వెల్లడించింది. దేశం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో పాక్ ప్రజలు ఇప్పటికే నానా అవస్థలూ పడుతున్నారు. దీనికి తోడు పాస్‌పోర్టుల జారీలో కూడా అసాధారణ జాప్యం జరుగుతుండటంతో పైచదువుల కోసం విదేశాలకు వెళ్లానుకునే వారి నడ్డివిరిగినట్టైంది. ప్రభుత్వం చేతకానితనానికి తాము ఫలితం అనుభవించాలా? అంటూ అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అయితే, త్వరలోనే పరిస్థితిని అదుపులోకి తెస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మీడియా విభాగం డైరెక్టర్ ఖాదిర్ యార్ తివానా పేర్కొన్నారు. ప్రజలు మాత్రం ఆయన మాటలను విశ్వసించే స్థితిలో లేకుండా పోయారు. పాస్‌పోర్టు దరఖాస్తుల ప్రాసెసింగ్ బాగా తగ్గిపోయిందని అక్కడి ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాలు చెబుతున్నాయి. ఒకప్పుడు సగటున రోజుకు 3000-4000 పాస్‌పోర్టులు జారీ చేసేవారమని, ఇప్పుడు ఈ సంఖ్య 13కు పడిపోయిందని చెబుతున్నాయి. భవిష్యత్తు అనిశ్చితిలో పడటంతో పాస్‌పోర్టు దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, 2013లోనూ పాక్‌ దాదాపుగా ఇదే పరిస్థితి ఎదుర్కొంది. అప్పట్లో పాక్ ఇమిగ్రేషన్ శాఖ ప్రింటర్ వర్తకులకు డబ్బు చెల్లించకపోవడం, లామినేషన్ పేపర్ల కొరత కారణంగా పాస్‌పోర్టు ముద్రణ పూర్తిగా నిలిచిపోయింది.


More Telugu News