పరుగెత్తుకెళ్లి నామినేషన్ వేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

  • చివరి నిమిషంలో హడావుడిగా నామినేషన్ దాఖలు
  • భారీ ర్యాలీ కారణంగా ముందుకు కదలని వాహనం
  • ఆఖరి నిమిషంలో కార్యాలయానికి చేరుకున్న రాజగోపాల్ రెడ్డి
గడువు సమీపిస్తున్న నేపథ్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నామినేషన్లు నమోదయ్యాయి. సెంటిమెంట్ పరంగా గురువారం మంచి రోజుగా భావించడంతో సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రి, పార్టీలకు అతీతంగా సీనియర్ నేతలు తమతమ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. బలప్రదర్శనలు, భారీ ర్యాలీల మధ్య నామినేషన్లు వేశారు. ఇందుకు సంబంధించి పలుచోట్ల  ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. నల్గొండ జిల్లా మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం చివరి నిమిషంలో ఉరుకులు పరుగుల మధ్య నామినేషన్ వేయాల్సి వచ్చింది. 

నామినేషన్‌కు ముందు ఆయన భారీ ర్యాలీగా బయలుదేరారు. కాంగ్రెస్ కార్యకర్తలు, రాజగోపాల్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మరోవైపు ప్రత్యర్థి పార్టీల నేతలు కూడా గురువారమే నామినేషన్లు వేయడంతో ట్రాఫిక్ సమస్య అనివార్యమైంది. ఈ ప్రభావంతో రాజగోపాల్ రెడ్డి వాహనం సకాలంలో కార్యాలయానికి చేరుకోలేకపోయింది. ఫలితంగా రాజగోపాల్ రెడ్డి చివరి క్షణంలో హైరానా పడాల్సి వచ్చింది. కార్యాలయంలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి నామినేషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. రిటర్నింగ్ ఆఫీసుకు 500 మీటర్ల దూరంలోనే వాహనాలు నిలిపేస్తారు కాబట్టి రాజగోపాల్ రెడ్డి పరుగెత్తాల్సి వచ్చింది. ఆయన వెంట సెక్యూరిటీ, ప్రధాన అనుచరులు సైతం పరిగెత్తడం మీడియా కంటపడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.


More Telugu News