విరాట్ కు నేను పెద్ద ఆభిమానిని: వివ్ రిచర్డ్స్

  • కింగ్ కోహ్లీపై ప్రశంసలు కురిపించిన వివ్ రిచర్డ్స్
  • అత్యుత్తమ ఆటగాళ్లలో అతడూ ఒకడని కితాబు
  • మైదానంలో తమ ఇద్దరి దూకుడు ఒకేలా ఉంటుందని వ్యాఖ్య
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. క్రికెట్ ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లల్లో అతడూ ఒకడని, చరిత్రలో నిలిచిపోతాడని రిచర్డ్స్ అభిప్రాయపడ్డాడు. 

‘‘ఈ టోర్నీలో ఎందరో గొప్ప ఆటగాళ్లను చూశాం గానీ వీళ్లందరిలోకి టాప్ ఎవరంటే మాత్రం విరాటే. నేను అతడికి పెద్ద ఫ్యాన్. సచిన్ లాంటి క్రికెట్ దిగ్గజాల మధ్య ఒకడిగా విరాట్ నిలిచిపోతాడు’’ అంటూ రిచర్డ్స్ కితాబునిచ్చాడు. 

ప్రపంచకప్ ముందు విరాట్ ఫామ్‌లేమితో సతమతమైన విషయాన్ని కూడా వివ్ ప్రస్తావించాడు. ‘‘ప్రపంచకప్ ముందు అతడు క్లిష్టపరిస్థిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అతడు ఇక అవసరం లేదని కూడా కొందరు అసాధారణ కామెంట్స్ చేశారు. కానీ, విరాట్ మళ్లీ ఫామ్ సాధించడంలో అతడి వెన్నంటి ఉన్నవారు, బ్యాక్ రూం స్టాఫ్‌‌కే క్రెడిట్ దక్కుతుంది. ఇప్పుడతను మళ్లీ తన అత్యద్భుత ప్రదర్శన స్థితికి వచ్చేశాడు. క్రికెటర్ల ఫామ్ తాత్కాలికమని అంటారు కానీ విరాట్ తాను ప్రత్యేకమని నిరూపించుకున్నాడు. అతడిని చూస్తే నాకు సంతోషంగా ఉంది. చాలా ఫోకస్డ్‌గా కనిపిస్తున్న అతడు క్రికెట్‌కు దక్కిన ఓ గొప్ప క్రీడాకారుడు’’ అని రిచర్డ్స్ వ్యాఖ్యానించాడు. 

విరాట్‌ను తనతో పోల్చడంపై కూడా వివ్ స్పందించాడు. ‘‘మైదానంలో మా ఇద్దరి తీరు ఒకేలా ఉండటంతో కొందరు విరాట్‌ను నాతో పోలుస్తుంటారు. క్రికెట్‌పై అతడికున్న ఆసక్తి నాకు నచ్చుతుంది. ఏ పొజిషన్‌లో ఆడుతున్నా, టీం బౌలర్లు ప్యాడ్స్ టచ్ చేసినా వెంటనే అప్పీలుకు వెళుతుంటాడు. అతడి దృష్టి ఎప్పుడూ గేమ్‌పైనే ఉంటుంది. అలాంటి వ్యక్తులంటే నాకు అభిమానం’’ అని రిచర్డ్స్ మీడియాతో వ్యాఖ్యానించాడు.


More Telugu News