శ్రీలంకపై గెలిచి సెమీస్ రేసులో నిలిచిన న్యూజిలాండ్

  • బెంగళూరులో మ్యాచ్
  • 5 వికెట్ల తేడాతో శ్రీలంక ఓటమి
  • 172 పరుగుల లక్ష్యాన్ని 23.2 ఓవర్లలో ఛేదించిన కివీస్
  • పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో విలియమ్సన్ సేన
వరల్డ్ కప్ సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు శ్రీలంకపై 5 వికెట్ల ఘనవిజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ లీగ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆల్ రౌండ్ షో ప్రదర్శించింది. తొలుత లంకేయులను 46.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ చేసిన కివీస్ జట్టు... 172 పరుగుల విజయలక్ష్యాన్ని కేవలం 23.2 ఓవర్లలోనే 5 వికెట్లకు ఛేదించింది.

కివీస్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు డెవాన్ కాన్వే (45), రచిన్ రవీంద్ర (42) తొలి వికెట్ కు 86 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఆ తర్వాత కెప్టెన్ కేన్ విలియమ్సన్ (14) విఫలం అయినప్పటికీ, ఫామ్ లో ఉన్న డారిల్ మిచెల్ (43) ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడాడు. గ్లెన్ ఫిలిప్స్ (17), టామ్ లాథమ్ (2) అజేయంగా నిలిచి జట్టును గెలుపుతీరాలకు చేర్చారు. శ్రీలంక బౌలర్లలో ఏంజెలో మాథ్యూస్ 2, మహీశ్ తీక్షణ 1, దుష్మంత చమీర 1 వికెట్ తీశారు. 

న్యూజిలాండ్, శ్రీలంక జట్లకు వరల్డ్ కప్ టోర్నీలో ఇదే చివరి లీగ్ మ్యాచ్. న్యూజిలాండ్ ప్రస్తుతం 9 మ్యాచ్ లు ఆడి 5 విజయాలతో 10 పాయింట్లు అందుకుంది. ఆ జట్టు సెమీస్ చేరాలంటే... పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్ ల్లో ఓడిపోవాలి. ఒకవేళ ఆ రెండు జట్లు గెలిస్తే రన్ రేట్ కీలకమవుతుంది. ప్రస్తుతానికి న్యూజిలాండ్ రన్ రేట్ 0.922 కాగా, పాకిస్థాన్ రన్ రేట్ 0.036, ఆఫ్ఘనిస్థాన్ రన్ రేట్ -0.038గా ఉంది.


More Telugu News