రూ.50 లక్షల నగదుతో దొరికిన మహాత్ముడు నాపై పోటీ చేస్తాడంట: రేవంత్ రెడ్డిపై కేసీఆర్

  • కామారెడ్డిలో ఎవరికి బుద్ధి చెప్పాలో ప్రజలు నిర్ణయించుకోవాలని సూచన
  • కేసీఆర్ చచ్చుడో... తెలంగాణ వచ్చుడో అని ఉద్యమించాక తెలంగాణ వచ్చిందన్న కేసీఆర్
  • కామారెడ్డి ప్రజా ఆశీర్వాద సదస్సులో కేసీఆర్
ఎవడైతే ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చి రూ.50 లక్షల నగదుతో పట్టుబడ్డాడో... ఇప్పుడు ఆ మహాత్ముడే కామారెడ్డిలో తన మీద పోటీ చేస్తాడంట అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కామారెడ్డిలో ఎవరికి బుద్ధి చెప్పాలో మీరే నిర్ణయించాలని ప్రజలను కోరారు. కామారెడ్డి ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమం సమయంలో తనను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కేసీఆర్ చచ్చుడో... తెలంగాణ వచ్చుడో అని జైత్రయాత్రకు బయలుదేరానని, చివరకు తెలంగాణను సాధించానన్నారు. ఎక్కడికక్కడ మీరు నరసింహులై లేస్తే.. ఊర్లన్ని ఉద్యమాలైతే.. సకల జనుల సమ్మె జరిగితే అప్పుడు దిగొచ్చి తెలంగాణ ప్రకటన చేశారన్నారు.

తెలంగాణను ప్రకటించేందుకు కాంగ్రెస్ పలుమార్లు మోసం చేసిందన్నారు. ఉద్యోగులు, ప్రజలు, రైతులు మొత్తం రోడ్ల మీదకు వచ్చి కొట్లాడితే.. చివరకు తెలంగాణల నూకలు పుట్టకుండా అవుతాయని భావించి అప్పుడు తెలంగాణ ప్రకటన చేశారని, ఇదీ కాంగ్రెస్‌ పరిస్థితి అన్నారు. ఆ తర్వాత వచ్చిన తెలంగాణను కూడా బతకనీయొద్దని, దీన్ని ముందల పడనీయద్దని, రాజకీయ అస్థిరత తేవాలని ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారన్నారు. కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన మహానుభావుడే ఇప్పుడు తనపై పోటీ అంటున్నాడని మండిపడ్డారు.


More Telugu News