భాగ్యనగరంలో నామినేషన్ల కోసం అభ్యర్థుల బారులు... భారీగా ట్రాఫిక్ జామ్

  • రేపటి వరకే గడువు... నేడు మంచిరోజు కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు
  • భారీ ర్యాలీలతో నామినేషన్ వేసేందుకు వచ్చిన ఆయా పార్టీల అభ్యర్థులు
  • ట్రాఫిక్ జామ్‌తో ప్రయాణికుల ఇబ్బందులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం రేపటితో (నవంబర్ 10) ముగియనుంది. దీనికి తోడు నేడు మంచి రోజు కావడంతో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు భారీ ర్యాలీలతో వచ్చారు. దీంతో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ కనిపించింది. మమూలుగానే భాగ్యనగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు అభ్యర్థుల హడావుడి నామినేషన్‌తో సామాన్యులు మరింత ఇబ్బంది పడుతున్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ తదితర పార్టీల అభ్యర్థులు భారీ ర్యాలీలు, రోడ్డు షోలతో నామినేషన్ వేసేందుకు తరలి వచ్చారు. దీంతో హైదరాబాద్‌లో చాలాచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కాస్త దూరం వెళ్లేందుకే గంటల సమయం పడుతోంది. కూకట్ పల్లి నుంచి ఎర్రగడ్డ, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్ మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. కేబీఆర్ పార్క్ నుంచి పంజాగుట్ట మార్గంలోనూ వాహనాలు భారీగా నిలిచిపోయాయి. మంచి రోజు కాబట్టి సీఎం కేసీఆర్ సహా పలువురు నేడే నామినేషన్ దాఖలు చేస్తున్నారు.


More Telugu News