షకీబల్ తీరును తీవ్రంగా తప్పుబట్టిన సొంత కోచ్.. షాకయ్యానన్న అలన్ డొనాల్డ్

  • ఏంజెలో మ్యాథ్యూస్ ‘టైమ్‌డ్ అవుట్’పై స్పందించిన బంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్
  • ఓ వ్యక్తిగా, క్రికెటర్‌గా ఈ ఘటన తనను షాక్‌కు గురిచేసిందన్న బౌలింగ్ కోచ్
  • మ్యాచ్ తర్వాత శ్రీలంక ఆటగాళ్లు కరచాలనానికి తిరస్కరించడాన్ని ముందే ఊహించానని వెల్లడి
ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మ్యాథ్యూస్ ‘టైమ్‌డ్ అవుట్’ కావడమే అందుకు కారణం. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలా అవుటైన తొలి క్రికెటర్‌గా మ్యాథ్యూస్ ఓ చెత్త రికార్డును తన పేరుపై రాసుకున్నాడు. సమయం మించిపోతున్నా అతడు క్రీజులోకి రాలేదంటూ బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్ అంపైర్‌కు ఫిర్యాదు చేయడంతో నిబంధనల ప్రకారం అతడిని అవుట్‌గా ప్రకటించారు. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. క్రీడా నిపుణులు కూడా దీనిని హర్షించలేదు. 

మ్యాథ్యూస్ టైమ్‌డ్ అవుట్‌పై తాజాగా బంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్, సౌతాఫ్రికా బౌలింగ్ గ్రేట్ అలన్ డొనాల్డ్ స్పందించాడు. షకీబల్ నిర్ణయం తనను షాక్‌కు గురిచేసిందన్నాడు. ఇది బంగ్లాదేశ్ క్లినికల్ పనితీరును కప్పివేసిందని అభిప్రాయపడ్డాడు. ‘‘నిజం చెప్పాలంటే ఓ వ్యక్తిగా, క్రికెటర్‌గా నేను కొంచెం షాకయ్యాను’’ అని ‘క్రిక్‌బ్లాగ్.నెట్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించిన తర్వాత ఆ జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు శ్రీలంక ఆటగాళ్లు నిరాకరించారు. ఇది తనను ఏమాత్రం ఆశ్చర్యపర్చలేదని పేర్కొన్నాడు. 

తాను మైదానంలోకి వెళ్లి అయిందేదో అయిపోయిందని, ఇలాంటి వాటికి సపోర్ట్ చేసే జట్టు తమది కాదని చెప్పాలనిపించిందని డొనాల్డ్ గుర్తు చేసుకున్నాడు. అధికారులతో మాట్లాడొచ్చని, కాకపోతే తాను ప్రధాన కోచ్‌ను కానీ, ఇన్‌చార్జ్‌ను కానీ కాదని వివరించాడు. మాథ్యూస్ అవుట్ తనను నిరాశపరిచిందన్న డొనాల్డ్.. షకీబల్ అవకాశం తీసుకున్నాడన్న విషయాన్ని తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్నాడు. 

తానేం చేసినా గెలవడానికేనని షకీబ్ అన్నాడని, అతడి మాటలను బట్టి చూస్తే అలా చేయడం అతడికి కూడా ఇష్టం లేనట్టుగానే ఉందన్న విషయం అర్థమవుతుందన్నాడు. శ్రీలంక ఆల్‌టైం గ్రేట్స్‌లో ఒకడైన బ్యాటర్ ఒక్క బంతి కూడా ఆడకుండా మైదానం నుంచి బయటకు వెళ్లడం ఏమంత బాగాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.


More Telugu News