‘యాపిల్’ సహ వ్యవస్థాపకుడికి స్ట్రోక్

  • మెక్సికో నగరంలో వరల్డ్ బిజినెస్ ఫోరం కార్యక్రమంలో బుధవారం ఘటన
  • తన ప్రసంగానికి ముందు స్టీవ్ వోజ్నియాక్‌ స్ట్రోక్ గురైనట్టు సమాచారం
  • వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలింపు
  • ఘటనపై ఇంకా వెలువడని అధికారిక ప్రకటన
టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనట్టు తెలుస్తోంది. మెక్సికో నగరంలో జరుగుతున్న వరల్డ్ బిజినెస్ ఫోరమ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన స్ట్రోక్‌కు గురికావడంతో కార్యక్రమ నిర్వాహకులు ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారట. బుధవారం సాయంత్రం 4.20 ఆయన ప్రసంగించాల్సి ఉందనంగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయమై కార్యక్రమ నిర్వాహకులు అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. 

వోజ్నియాక్, స్టీవ్ జాబ్స్ కలిసి 1976లో యాపిల్ సంస్థను నెలకొల్పిన విషయం తెలిసిందే. తమ అత్యాధునిక, సృజనాత్మక డిజైన్లతో డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లకు యాపిల్ సంస్థ సరికొత్త క్రేజ్ తీసుకొచ్చింది. యాపిల్ ఉత్పత్తులు స్టేటస్ సింబల్స్‌గా ప్రజలు భావించే స్థాయికి సంస్థ బ్రాండ్‌ను అభివృద్ధి చేశారు. 

1950లో కాలిఫోర్నియాలోని శాన్ హోసేలో జన్మించిన వోజ్నియాక్ చిన్నతనంలోనే ఎలక్ట్రానిక్స్‌పై మక్కువ పెంచుకున్నారు. 11 ఏళ్లకే సొంతంగా ఓ కంప్యూటర్ తయారు చేశారు. యూనివర్సిటీ ఆఫ్ బర్క్‌లీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసిన వోజ్నియాక్.. స్టీవ్ జాబ్స్‌తో కలిసి ప్రపంచంలో కమర్షియల్‌గా విజయవంతమైన తొలి పర్సనల్ కంప్యూటర్ రూపొందించారు.


More Telugu News