ఇక హైదరాబాద్ మునుగుడు షురూ అయ్యింది: బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ ఫైర్

  • బుధవారం హైదరాబాద్ రోడ్లపై వర్షపు నీరు నిలవడం, ట్రాఫిక్‌ అంతరాయంపై స్పందన
  • ఇస్తాంబుల్, షికాగో అన్నారు.. కానీ చినుకు పడితే అడుగుపెట్టే పరిస్థితిలేదని విమర్శ
  • వర్షాకాలం అదే గోస.. చలికాలం కూడా అదే వరుస అంటూ వ్యాఖ్యలు 
అధికార బీఆర్ఎస్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. కాళేశ్వరం మునగడం అయిందని, ఇక  హైదరాబాద్ మునుగుడు షురూ అయ్యిందని విమర్శించారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో కురిసిన వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలవడం, ట్రాఫిక్‌కు తీవ్రమైన అంతరాయం ఏర్పడటంపై ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. వర్షాకాలం అదే గోస.. చలికాలం కూడా అదే వరుస అని కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు.

 ‘ఇస్తాంబుల్ అన్నారు.. షికాగో అన్నారు.. విశ్వనగరం’ అని గప్పాలు కొట్టారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రూ.కోట్లు పెట్టి ప్రచారాలు చేశారు కానీ చినుకు పడితే వణుకు పుడుతోందని, అడుగు బయట పెడితే గల్లంతయ్యే పరిస్థితులు ఉన్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు.

 వేల కోట్ల రూపాయల ఖర్చు ఫలితం ఇదేనా? అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నిలదీశారు. కమిషన్ల పేరుతో మొత్తం మీరే మేసేస్తే ఇక మార్పు ఎక్కడ వస్తుందని ప్రశ్నించారు. ‘అందుకే మార్పు కావాలి! కాంగ్రెస్ రావాలి!’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో వర్షం కురిసిన తర్వాత ట్రాఫిక్, రోడ్లపై నిలిచిన నీరుకు సంబంధించిన ఫొటోలను ట్వీట్‌కు జోడించారు.


More Telugu News