ఆస్ట్రేలియాలో పబ్‌‌లోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు భారత సంతతి వ్యక్తుల మృతి

  • హోటల్ ముందు లాన్‌లో నిలుచొని ఉండగా దూసుకొచ్చిన బీఎండ్ల్యూ
  • అక్కడికక్కడే నలుగురి మృతి
  • బాధితులంతా రెండు భారత సంతతి కుటుంబాలకు చెందినవారే
ఆస్ట్రేలియాలోని విక్టోరియా గ్రామీణ ప్రాంతంలోని ఓ పబ్‌లోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు భారత సంతతి వ్యక్తులు చనిపోయారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. బాధితులు అందరూ రెండు భారత సంతతి కుటుంబాలకు చెందినవారని ఆస్ట్రేలియా మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. విక్టోరియాలోని డేలెస్‌ఫోర్డ్‌లో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. రాయల్ డేల్స్‌ఫోర్డ్ హోటల్ ముందు లాన్‌లో నిలుచున్నవారి మీదకు అకస్మాత్తుగా తెల్లటి బీఎండబ్ల్యూ ఎస్‌యూవీ దూసుకొచ్చిందని పోలీసులు వెల్లడించారు.

ప్రమాద స్థలంలోనే నలుగురు మృతి చెందారని విక్టోరియా చీఫ్ పోలీసు కమిషనర్ షేన్ పాటన్ వెల్లడించారు. చనిపోయిన వారి పేర్లు వివేక్ భాటియా (38), ఆయన కొడుకు విహాన్ (11), ప్రతిభా శర్మ (44), ఆమె కూతురు అన్వీ (తొమ్మిది), పార్టనర్ జతిన్ చుగ్ (30) ఉన్నారని వివరించారు. తీవ్రంగా గాయపడిన అన్వీని హుటాహుటిన మెల్‌బోర్న్‌లోని ఆల్‌ఫ్రెడ్ ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం ఆమె చనిపోయిందని పోలీసులు వెల్లడించారు. భాటియా భార్య రుచి, ఆరేళ్ల కొడుకు అబీర్ తీవ్రగాయాలతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ఆస్ట్రేలియా మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. అబీర్ పరిస్థితి మొదట్లో ఆందోళనకరంగా అనిపించినా ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన మరికొందరికి చికిత్స అందుతోందని వివరించారు.

కాగా ఈ ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ డ్రైవర్ వయసు 66 సంవత్సరాలని, అతడు మౌంట్ మాసిడోన్‌కు చెందిన వాడని పోలీసులు తెలిపారు. గాయాల పాలవ్వడంతో అతడిని కూడా ఆసుపత్రికి తరలించామని, అతడి ప్రాణాలకు ఎలాంటి ముప్పులేదని పేర్కొన్నారు. కాగా అతడికి ఆల్కహాల్ టెస్ట్ చేయగా మద్యం తీసుకోలేదని తేలిందని, రక్త నమూనాలను కూడా విశ్లేషించనున్నట్టు కమిషనర్ ప్యాటన్ వివరించారు.


More Telugu News