ఇప్పుడు వార్ వన్ సైడ్ అయింది: బీజేపీ నేత లక్ష్మణ్

  • తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే బీసీ సీఎం అవుతారన్న లక్ష్మణ్
  • సామాజిక న్యాయం కోసమే బీసీ సీఎం కావాలని కోరుకుంటున్నామని స్పష్టీకరణ
  • ఎన్టీఆర్ తర్వాత సామాజిక న్యాయం చేస్తోన్న పార్టీ బీజేపీయే అని వ్యాఖ్య
గతంలో నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తే ఇక్కడి ప్రజలు ఆశీర్వదించారని, ఆ తర్వాత ఆయన ప్రధాని అయ్యారని, ఇప్పుడు పదేళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే బీజేపీ నుంచి బీసీ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. కొల్లాపూర్ నుంచి పలువురు బీజేపీలో చేరారు. వారికి లక్ష్మణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీజేపీ గెలిస్తే తెలంగాణకు బీసీ సీఎం అవుతారని ప్రజలు భావిస్తున్నారన్నారు. అందుకే బీజేపీని గెలిపించాలనుకుంటున్నట్లు చెప్పారు.

సామాజిక న్యాయం కోసం బీసీ సీఎం కావాలని కోరుకుంటున్నామన్నారు. బీసీ సీఎంను ప్రకటించడంతో బీసీలందరూ ఒక్కటయ్యారని, మిగతా వర్గాలు కూడా బీజేపీ వైపు చూస్తున్నాయన్నారు. ఇప్పుడు వార్ వన్ సైడ్ అయిందన్నారు. ఎన్టీఆర్ తర్వాత సామాజిక న్యాయం చేస్తోన్న పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో కుటుంబ పార్టీ అయితే, కాంగ్రెస్ దేశంలో కుటుంబ పార్టీ అన్నారు. కానీ బీజేపీ దేశం కోసం పని చేసే పార్టీ అన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన మోదీ ప్రధాని ఆయితే రాహుల్ గాంధీ, ఆయన కుటుంబం అవహేళన చేస్తోందన్నారు.

కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడిస్తున్నా బుద్ధి రావడం లేదన్నారు. బీసీ సీఎంను ప్రకటిస్తే రెండు శాతం ఓట్లు వస్తాయని రాహుల్ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అన్ని సమీకరణాలు తీసుకొని 100 సీట్లకు గాను తాము 35 స్థానాలను బీసీలకు కేటాయించామన్నారు. బీఆర్ఎస్ అధికార పీఠాలు, గడీల రాజ్యాన్ని బద్దలు కొట్టేందుకు బీసీలు ఒక్కటవుతున్నారన్నారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ ఇస్తే కూడా కేసీఆర్ సహించలేదన్నారు. కాంగ్రెస్, కేసీఆర్‌లలో ఎవరిని నమ్మినా పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లే అన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


More Telugu News