వరల్డ్ కప్ లో అదరగొడుతున్న షమీ.. మాజీ భార్య హసీన్ స్పందన
- షమీ బాగా ఆడితే బాగా సంపాదిస్తాడన్న హసీన్
- అతను సంపాదిస్తే తమకు సురక్షితంగా ఉంటుందని వ్యాఖ్య
- షమీ బాగా ఆడాలని ఆకాంక్ష
వన్డే ప్రపంచకప్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ చెలరేగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లలో షమీకి స్థానం దక్కలేదు. అయితే హార్దిక్ పాండ్యా గాయపడటంతో... అతని స్థానంలో షమీకి చోటు దక్కింది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడిన షమీ 16 వికెట్లను పడగొట్టాడు. ప్రపంచకప్ లో షమీ ప్రదర్శనపై ఆయన మాజీ భార్య హసీన్ జహాన్ స్పందించింది. ఓ హిందీ ఛానల్ చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా షమీ గురించి అభిప్రాయం చెప్పాలని అడగగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
షమీ బాగా ఆడితే భారత జట్టులోనే ఉంటాడని, బాగా సంపాదిస్తాడని, అతను సంపాదిస్తే తమకు కూడా సురక్షితంగా ఉంటుందని హసీన్ వ్యాఖ్యానించింది. షమీ బాగా ఆడాలని ఆకాంక్షించింది. అభిప్రాయ భేదాల కారణంగా షమీ, హసీన్ ఇద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల ప్రకారం హసీన్ కు షమీ ప్రతి నెల రూ. 1.3 లక్షలు భరణంగా చెల్లిస్తున్నాడు.