కాళేశ్వరంపై సీబీఐ విచారణకు కేసీఆర్ అనుమతి అవసరం లేదు: కిషన్ రెడ్డికి సీబీఐ మాజీ డైరెక్టర్ సూచన

  • కేసీఆర్ అంగీకరిస్తే రెండు గంటల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరుపుతామన్న కిషన్ రెడ్డి
  • కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు
  • సీబీఐ విచారణకు ఎవరి అనుమతి అవసరం లేదన్న నాగేశ్వరరావు
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపడానికి తెలంగాణ ప్రభుత్వం లేదా కేసీఆర్ అనుమతి అవసరం లేదని సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు అన్నారు. ఇటీవల బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అంగీకరిస్తే రెండు గంటల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరుపుతామని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై నాగేశ్వరరావు బుధవారం స్పందించారు. ఈ ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపవచ్చునని, సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి అవసరం లేదని కిషన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. సీబీఐ విచారణకు ఎవరి అనుమతి అవసరం లేదని తెలిపారు. కేంద్ర జలశక్తి శాఖ సీబీఐ విచారణకు ఆదేశించవచ్చునని స్పష్టం చేశారు.

కేంద్రానికి చెందిన పది ఏజెన్సీలు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతిలిచ్చాయని గుర్తు చేశారు. అందుకే కేంద్రమే సీబీఐ విచారణ కోరవచ్చునన్నారు. అలాగే అవినీతి నిరోధక చట్టం 17ఏ ప్రకారం కేంద్ర జలశక్తి శాఖ సీబీఐ విచారణను కోరవచ్చునని తెలిపారు. ఒకవేళ సీబీఐ విచారణలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిందితులుగా తేలితే అప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం ఉంటుందని కిషన్ రెడ్డికి సూచించారు.


More Telugu News