కాలుష్యం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలకు ఈ ఆహార పదార్థాలతో చెక్ పెట్టొచ్చట!
- రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యం
- శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్న జనం
- ఆహారంలో మార్పులతో అనారోగ్య ముప్పును తప్పించుకోవచ్చంటున్న నిపుణులు
దేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది.. ఢిల్లీ చుట్టుపక్కల నగరాలతో పాటు హైదరాబాద్ లోనూ కాలుష్యం పెరుగుతోంది. కాలుష్యం పెరిగిందని బయటకు వెళ్లకుండా ఉండలేం.. వెళితే అనారోగ్యం తప్పదు. అయితే, ఆహారపుటలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా కాలుష్యం కారణంగా వచ్చే అనారోగ్యాలను దూరం పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కాలుష్య నియంత్రణకు మనవంతుగా తోడ్పడుతూ, ఆహార పదార్థాలతో ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చని చెబుతున్నారు. అవేంటంటే..
- అల్లం.. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే గుణం అల్లంలో ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అల్లం టీ లేదా తేనెతో కలిపి అల్లం తీసుకోవడం ద్వారా అనారోగ్య ముప్పును తగ్గించుకోవచ్చని అంటున్నారు.
- నల్ల మిరియాలతో జలుబు, దగ్గును దూరం చేసుకోవచ్చని, రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని సూచిస్తున్నారు.
- రోజువారీ ఆహారంలో పసుపును తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చని చెబుతున్నారు. కాలుష్యం కారణంగా ఎదురయ్యే ఇతరత్రా అనారోగ్య సమస్యలకూ పసుపు చెక్ పెడుతుందట.
- డ్రైఫ్రూట్స్.. శరీర ఆరోగ్యానికి డ్రైఫ్రూట్స్ చేసే మేలు అంతాఇంతా కాదు. రోజూ డ్రైఫ్రూట్స్ తీసుకుంటే అనారోగ్య చికాకులను తప్పించుకోవచ్చు.
- చలికాలంలో మార్కెట్లో విరివిగా లభించే నారింజ పళ్లతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పళ్లు తినడం ద్వారా జీర్ణక్రియ సాఫీగా జరుగుతుందని, కాలుష్యాన్ని ఎదుర్కోవాలంటే నారింజ లాంటి సిట్రస్ ఫ్రూట్స్ తినాలని సూచిస్తున్నారు.
- చలికాలంలో కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాలుష్యం వల్ల కలిగే ఆస్తమా, టీబీ వంటి శ్వాసకోశ వ్యాధులను దూరం పెట్టేందుకు బెల్లం తినాలని సూచిస్తున్నారు. కాలుష్యం వల్ల కలిగే దుష్పరిణామాలను బెల్లం తినడం ద్వారా ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు.