నడుస్తున్న గూడ్స్ రైలు మీద బ్రిడ్జిపైనుంచి పడిన కారు.. ముగ్గురి మృతి

  • మహారాష్ట్రలోని కర్జత్-పన్వేల్ స్టేషన్ల మధ్య ఘటన
  • తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు
  • మృతుల్లో ఒకరైన ధర్మేంద్ర రిపబ్లిక్ పార్టీ కార్యకర్త
  • విచారణకు డిమాండ్ చేసిన రిపబ్లికన్ పార్టీ చీఫ్, కేంద్రమంత్రి రాందాస్ అథవాలే
నడుస్తున్న గూడ్స్ రైలుపై బ్రిడ్జిపైనుంచి వెళ్తున్న కారు పడి ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని కర్జత్-పన్వెల్ స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్, కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఈ ఘటనపై విచారణ కోరారు. మంగళవారం తెల్లవారుజామున 3.30-4 గంటల మధ్య కినావలి బ్రిడ్జ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు నేరెల్‌వైపు ప్రయాణిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  

మృతులను ధర్మేంద్ర గైక్వాడ్ (41), ఆయన కజిన్ మంగేశ్ జాదవ్ (46), నితీన్ జాదవ్ (48)గా గుర్తించారు. ధర్మేంద్ర రిపబ్లికన్ పార్టీ (అథవాలే గ్రూప్) కార్యకర్త అని అధికారులు తెలిపారు.  గూడ్స్ రైలు పన్వేల్‌ నుంచి రాయ్‌గడ్‌లోని కర్జత్ వైపు వెళ్తోంది. ప్రమాదం కారణంగా రైలు బోగీలు రెండు విడిపోయినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాదం నేపథ్యంలో దాదాపు నాలుగు గంటలపాటు పన్వేల్-కర్జత్ సెక్షన్‌ను మూసివేశారు.  గైక్వాడ్, ఇతరుల మృతికి కేంద్రమంత్రి రాందాస్ సంతాపం తెలిపారు. ప్రమాదంపై విచారణకు డిమాండ్ చేశారు.


More Telugu News