ఆఫ్ఘనిస్థాన్‌పై డబుల్ సెంచరీ కొట్టిన మ్యాక్స్‌వెల్‌కు సచిన్ ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రశంస

  • ‘నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ ప్రదర్శన’ ఇదేనంటూ సచిన్ ప్రశంస 
  • తీవ్రమైన ఒత్తిడిలో గొప్ప ప్రదర్శన చేశాడంటూ కితాబు
  • ఆఫ్ఘనిస్థాన్‌పై మ్యాక్స్‌వెల్ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం
తన జట్టు ఓటమి అంచున సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అత్యద్భుత బ్యాటింగ్‌తో డబుల్ సెంచరీ సాధించి ఆఫ్ఘనిస్థాన్‌పై ఆస్ట్రేలియాను గెలిపించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. మాజీ దిగ్గజాలు సైతం అతడి ఇన్నింగ్స్‌ని మెచ్చుకుంటున్నారు. ‘నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ వన్డే ప్రదర్శన ఇదే’ అని ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ అభినందించాడు. తీవ్రమైన ఒత్తిడిలో మ్యాక్స్‌వెల్ నుంచి అత్యుత్తమ ప్రదర్శన వచ్చిందంటూ ‘ఎక్స్’ వేదికగా టెండూల్కర్ వ్యాఖ్యానించాడు. ఆఫ్ఘనిస్థాన్ నిర్దేశించిన 292 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన తరుణంలో మ్యాక్స్‌వెల్ అద్భుతం చేసిన విషయం తెలిసిందే. ఏకంగా 201 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు అధికారికంగా అర్హత సాధించింది. 

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ స్పందిస్తూ.. క్రికెట్ మైదానంలో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనలలో ఇదొకటని ప్రశంసించాడు. గతంలో ఎప్పుడూ చూడని గొప్ప ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోతుందని, ‘నెవర్ గివ్ అప్’ సందేశానికి గొప్ప పాఠమని వ్యాఖ్యానించాడు. అసలు నమ్మశక్యం కాని ఇన్నింగ్స్ అని మైఖేల్ వాన్ ‘ఎక్స్’ వేదికగా స్పందించాడు. ఇక ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ స్పందిస్తూ... "మై గుడ్‌నెస్ మ్యాక్సీ" అంటూ ‘ఎక్స్’ వేదికగా స్పందించాడు. షాక్ ఫేస్ ఎమోజీలను జోడించాడు.

కాగా వరల్డ్ కప్‌లో డబుల్ సెంచరీ కొట్టిన మూడవ బ్యాట్స్‌మెన్‌గా మ్యాక్స్‌వెల్ రికార్డ్ సాధించాడు. అంతకు ముందు న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్టిల్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ డబుల్ సెంచరీలు కొట్టారు. వీరిద్దరూ 2015 ఎడిషన్ టోర్నీలో ఈ ఫీట్ సాధించారు.


More Telugu News