ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తప్పిన ప్రమాదం

  • రాజస్థాన్‌లో ప్రచార వాహనాన్ని తాకిన విద్యుత్ వైర్లు
  • తెగి పడిన ఒక కరెంటు తీగ.. వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేత
  • బీజేపీ నేతల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి పెనుప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్‌లోని నాగౌర్‌‌లో రోడ్ షో నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ వైర్లు ఆయన ప్రచార వాహనాన్ని తాకాయి. దీంతో కరెంటు తీగ తెగి కింద పడింది. గమనించిన బీజేపీ నేతలు వెంటనే అప్రమత్తమయ్యారు. అమిత్‌ షా వాహనం వెనుక ఉన్న అన్ని వాహనాలను అప్రమత్తం చేశారు. వాహనాలను నిలిపివేసి కరెంటు సరఫరాను నిలిపేశారు. దీంతో ప్రమాదం తప్పింది. హోమంత్రి అమిత్ షా సహా ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. ఎన్నికల సభలో పాల్గొనేందుకు బిడియాద్  గ్రామం నుంచి పర్బత్‌సర్ దిశగా వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మంగళవారం రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించిన అమిత్‌ షా.. భాజపా అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ఘటనపై రాజస్థాన్‌ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ గెహ్లాట్ స్పందించారు. ప్రమాదం తప్పడంపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. కాగా రోడ్డుకు ఇరువైపులా ఇళ్లు, దుకాణాలు ఉన్న వీధిలో ర్యాలీ నిర్వహించారు. దీంతో కరెంటు వైర్లు వాహనానికి దగ్గరగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


More Telugu News