నేను అమ్మేసిన కంపెనీ ప్రపంచంలో అతి పెద్ద విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ అయింది: రానా

  • మొదట్లో తనకు నటనపై ఆసక్తి లేదన్న రానా
  • ఓ వీఎఫ్ఎక్స్ సంస్థను స్థాపించానని వెల్లడి
  • నాలుగేళ్లు అతికష్టం మీద నడిపానని వివరణ 
  • ఇక నడపలేక ప్రైమ్ ఫోకస్ అనే సంస్థకు అమ్మేసినట్టు వెల్లడి 
సినిమానే జీవితంగా ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నటుడు రానా దగ్గుబాటి. తాతా రామానాయుడు, తండ్రి సురేశ్ బాబు ఇద్దరూ ప్రముఖ నిర్మాతలే. బాబాయ్ వెంకటేశ్ అగ్రహీరోల్లో ఒకరు. ఈ నేపథ్యంలో, నటుడిగా ఎంట్రీ ఇచ్చిన రానా విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు అందుకున్నారు. లీడర్, బాహుబలి చిత్రాలు, నేనే రాజు నేనే మంత్రి, అరణ్య, ఘాజీ, భీమ్లా నాయక్ వంటి చిత్రాలతో నటుడిగా ఎంతో ఎదిగారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రానా ఆసక్తికర అంశాలు వెల్లడించారు. మొదట్లో తనకు గ్రాఫిక్స్ అంటే చాలా ఆసక్తి ఉండేదని వెల్లడించారు. నటుడిగా వస్తానని ఎప్పుడూ అనుకోలేదని, గ్రాఫిక్స్ పై ఆసక్తితో సంబంధిత కోర్సులు నేర్చుకుని స్పిరిట్ మీడియా అనే వీఎఫ్ఎక్స్ సంస్థను స్థాపించానని తెలిపారు. బాహుబలి వంటి భారీ చిత్రాన్ని తన సంస్థలో గ్రాఫిక్స్ ఉపయోగించి తీయాలని భావించినా అది సాధ్యం కాలేదని అన్నారు. 

తన సంస్థను నాలుగేళ్ల పాటు అతికష్టమ్మీద నడిపించానని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత ఇక ఎంత మాత్రం నడపలేనని నిర్ణయించుకుని, ఓ మిత్రుడితో చర్చించిన తర్వాత ప్రైమ్ ఫోకస్ అనే సంస్థకు అమ్మేశానని రానా వెల్లడించారు. తాను అమ్మేసిన సంస్థ ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద వీఎఫ్ఎక్స్ సంస్థగా కొనసాగుతోందని చెప్పారు. 

ఆ సంస్థను అమ్మేసిన తర్వాత తన కుటుంబంలో దానికి సంబంధించి గొడవ జరిగిందని, కొన్నాళ్ల పాటు తండ్రితో కూడా మాట్లాడలేదని వివరించారు. అంతేకాదు, 2005లో తాను 'ఏ బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్' అనే సినిమా తీశానని రానా తెలిపారు. ఆ సినిమాకు రెండు అవార్డులు కూడా వచ్చాయని చెప్పారు.


More Telugu News