విజయవాడ బస్సు ఘటన... డ్రైవర్ సహా ముగ్గురిపై చర్యలు

  • విజయవాడ బస్టాండు బస్సు ప్రమాదంపై నివేదిక సమర్పించిన ఆర్టీసీ అధికారుల కమిటీ
  • డ్రైవర్ ప్రకాశం తప్పు గేర్ ఎంచుకున్నాడని కమిటీ వెల్లడి
  • డ్రైవర్ కు ఆటోమేటిక్ గేర్ బస్సులపై అవగాహన లేదని స్పష్టీకరణ
  • డిపో అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ పై చర్యలకు కమిటీ సిఫారసు
విజయవాడ బస్ స్టేషన్ లో ఓ బస్సు ప్లాట్ ఫాంపైకి దూసుకొచ్చిన ఘటనలో ముగ్గురు మృతి చెందడం దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారుల కమిటీ నివేదిక సమర్పించింది. ఘటన జరిగిన సమయంలో బస్సు డ్రైవర్ గా వ్యవహరించిన ప్రకాశం గేర్ ను తప్పుగా ఎంచుకోవడమే ప్రమాదానికి కారణమని నివేదిక స్పష్టం చేసింది. 

ఈ నేపథ్యంలో డ్రైవర్ ప్రకాశం, అతడ్ని విధులకు పంపిన డిపో సహాయ మేనేజర్ వీవీ లక్ష్మి, ఆటోనగర్ డిపో వ్యవహారాల పరిశీలనలో విఫలమయ్యారంటూ డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ లపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ మేనేజ్ మెంట్ నిర్ణయించింది. 

కాగా, ప్రమాదానికి కారణమైన బస్సు ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ కలిగిన బస్సు. సాధారణ గేర్లు ఉండే బస్సులు నడిపిన వారు ఈ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థ కలిగిన బస్సులను నడపలేరు. డ్రైవర్ ప్రకాశం పరిస్థితి కూడా ఇదే. ఆయన గతంలో సూపర్ లగ్జరీ బస్సు నడిపారే తప్ప, ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఉండే వోల్వో తదితర ఆధునిక బస్సులు ఎప్పుడూ నడపలేదు. 

కాగా, ఆర్టీసీ అధికారుల కమిటీ నివేదిక నేపథ్యంలో డ్రైవర్ ప్రకాశంను సస్పెండ్ చేశారు. ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ పై ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే డ్రైవర్ ప్రకాశానికి విధులు కేటాయించారని నివేదిక స్పష్టం చేసింది. ఆటోనగర్ డిపో అసిస్టెంట్ మేనేజర్ లక్ష్మి, డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ లపైనా చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసింది.


More Telugu News