ఇదిగో ఆధారాలు... బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే!: బీసీ ఆత్మగౌరవ సభలో కిషన్ రెడ్డి

  • కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌కు అమ్ముడుపోయారా? లేదా?అన్న కిషన్ రెడ్డి 
  • కాంగ్రెస్ నుంచి గెలిచే ఎమ్మెల్యేలు పార్టీ మారరని గ్యారెంటీ ఇస్తారా? అని ప్రశ్న
  • బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ ఒకే తాను ముక్కలన్న కిషన్ రెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌కు అమ్ముడుపోయారా? లేదా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ నుంచి గెలవబోయే వారు మళ్లీ అమ్ముడుపోమని గ్యారెంటీ ఇవ్వగలరా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీ అయితే, బీఆర్ఎస్ కొనుక్కునే పార్టీ అన్నారు. పదేళ్ల క్రితం మోదీ ఇదే స్టేడియానికి వచ్చారని, ఆ సభ తర్వాత ప్రధాని అయ్యారన్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన సభ దేశంలో మార్పుకు నాంది పలికిందన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ ఒకే తాను ముక్కలని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఉదాహరణలు చెప్పారు. కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థికి బీఆర్ఎస్ ఘన స్వాగతం పలికిందని, కానీ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా వస్తే మాత్రం కేసీఆర్ పట్టించుకోలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ హయాంలో బీఆర్ఎస్ నేతలు మంత్రులుగా ఉన్నారని, మన్మోహన్ సింగ్ హయాంలో కేసీఆర్ మంత్రిగా ఉన్నారన్నారు. కాంగ్రెస్‌తో రాష్ట్రంలో ఎలాంటి మార్పు రాదన్నారు.


More Telugu News