ఢిల్లీ వాయు కాలుష్యం అంశంలో కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు

  • దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ప్రమాదకర స్థాయికి కాలుష్యం
  • తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సీజేఐ ధర్మాసనం
  • పంజాబ్ లో పంటల దహనం ఇంకా కొనసాగుతూనే ఉందని అసంతృప్తి
  • దహనాల నివారణ ప్రభుత్వాలదేనని స్పష్టీకరణ
  • శుక్రవారం నాటికి చర్యలు తీసుకోవాలని ఆదేశం 
దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యం అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ కాలుష్యం వ్యవహారంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఓ పిటిషన్ పై విచారణ సందర్భంగా సీజేఐ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ రాజధాని ప్రాంతం, పరిసరాల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరినప్పటికీ, పొరుగునే ఉన్న పంజాబ్ లో పంటల దహనం ఇంకా కొనసాగుతూనే ఉందని అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలుష్య నివారణ అనేది కాగితాలకే పరిమితమవుతోంది తప్ప, ఆచరణలో కనిపించడంలేదని వెల్లడించింది. 

ఈ సందర్భంగా, కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని సీజేఐ ధర్మాసనం ప్రభుత్వాలను ప్రశ్నించింది. పరస్పర విమర్శలు చేసుకోవడం కట్టిపెట్టాలని, ఇది రాజకీయ పోరాటం కాదని స్పష్టం చేసింది. ఓసారి కాలుష్య బాధిత చిన్నారులను చూస్తే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థమవుతుందని హితవు పలికింది. 

ఢిల్లీలోనూ, పంజాబ్ లోనూ ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి కదా... ఇకనైనా పంట వ్యర్థాల దహనం వెంటనే ఆపాలి... మేం కోరుతున్నది ఇదే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాలుష్య కోరల్లో చిక్కి మనుషులు చనిపోయేందుకు అనుమతించలేమని తేల్చి చెప్పింది. 

ఈ సమయంలో వరినాట్లు కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని ఉద్ఘాటించింది. పంట వ్యర్థాల దహనం నివారణ బాధ్యత రాష్ట్ర  ప్రభుత్వాలదేనని పేర్కొంది. శుక్రవారం నాటికి దీనిపై చర్యలు తీసుకోవాలని సీజేఐ ధర్మాసనం ఆదేశించింది. 

సరి, బేసి విధానం, ఇతర ఆంక్షలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మాత్రమేనని, పూర్తి స్థాయి పరిష్కారం కాదని వ్యాఖ్యానించింది. సరి, బేసి ఆంక్షలతో ఎప్పుడైనా మంచి ఫలితాలు వచ్చాయా? అని ఢిల్లీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది.


More Telugu News