ఓటు వేయకుండానే వెనుదిరిగి మళ్లీ వచ్చిన సీఎం... కారణమిదే!
- కొనసాగుతున్న మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
- సీఎం ఓటు వేసేందుకు వెళ్లిన సమయంలో పని చేయని ఈవీఎం
- కాసేపటి తర్వాత మళ్లీ వచ్చి ఓటు వేసిన ముఖ్యమంత్రి
మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈరోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పోలింగ్ ప్రారంభమైన కాసేపటికి తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు మిజోరం ముఖ్యమంత్రి జోరంథంగా... ఐజ్వాల్ నార్త్-2 నియోజకవర్గ పరిధిలోని వెంగ్లాయ్-1 పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అయితే ఆ సమయంలో అక్కడ ఈవీఎం పని చేయకపోవడంతో ఆయన ఓటు వేయలేకపోయారు. కాసేపు ఎదురు చూసినప్పటికీ ఈవీఎం పని చేయకపోవడంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు. తన నియోజకవర్గంలో కాసేపు పర్యటించిన తర్వాత మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోయారు. మధ్యాహ్నం సమయంలో మళ్లీ వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిజోరంలో మొత్తం 40 శాసనసభ స్థానాలు ఉండగా... అన్ని స్థానాలకు ఈరోజు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది.