తుమ్మల నాగేశ్వరరావు ఫిర్యాదుపై స్పందించిన పువ్వాడ అజయ్

  • తుమ్మలకు ఓటు వేస్తే మంచి ఓటు, లేకపోతే దొంగవోటా? అని నిలదీత
  • కక్షపూరితంగా మమత మెడికల్ కాలేజీ విద్యార్థుల ఓట్లపై ఫిర్యాదు అని ఆగ్రహం
  • సీనియర్ నాయకుడినంటూ తుమ్మల దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్న పువ్వాడ
తుమ్మలకు ఓటు వేస్తే మంచి ఓటు... లేకపోతే దొంగ ఓటా? తుమ్మలకు ఓటు వేసేవారికే ఓటు ఉండాలా? ఇతరులకు ఉండవద్దా? అని మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ... దొంగ ఓట్ల నమోదుపై ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంపై మండిపడ్డారు. కక్షపూరితంగానే మమత మెడికల్ కాలేజీ విద్యార్థుల ఓట్లపై తుమ్మల ఈసీకి లేఖ రాశారన్నారు. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు వేయవచ్చునని, కాబట్టి మమత మెడికల్ కాలేజీ విద్యార్థులు ఓటు హక్కు నమోదు చేసుకుంటే తప్పా? అని ప్రశ్నించారు.

సీనియర్ రాజకీయ నాయకుడినని చెప్పుకుంటూ తుమ్మల దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులు ఓటు కోసం నమోదు చేసుకుంటే తప్పేమిటో చెప్పాలన్నారు. కాగా, అంతకుముందు... ఖమ్మంలో ఇంటి నెంబర్లు లేకుండా ఓట్లు నమోదు చేశారని, 30వేలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని తమ్ముల ఆరోపిస్తూ ఈసీకి లేఖ రాశారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్, సీఈవో, ఇతర ఎన్నికల అధికారులు పట్టించుకోలేదని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ఇంటి నెంబర్లు లేకుండా నమోదు చేసిన ఓట్లను వెంటనే తొలగించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని తుమ్మల కోరారు.


More Telugu News