ఇసుక కేసు.. ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన చంద్రబాబు

  • టీడీపీ హయాంలో ఉచితంగా ఇసుక సరఫరా
  • తవ్వకం, రవాణా ఖర్చులను పెట్టుకున్న ప్రజలు
  • ప్రభుత్వానికి రూ. 1,300 కోట్ల నష్టం వాటిల్లిందంటూ చంద్రబాబుపై కేసు
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం వరుసగా వివిధ కేసులు నమోదు చేస్తోంది. తాజాగా ఆయనపై ఇసుక కేసును కూడా నమోదు చేసింది. టీడీపీ హయాంలో ఇసుకను ఉచితంగా ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రూ. 1,300 కోట్ల నష్టం వాటిల్లిందని సీఐడీ పేర్కొంది. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమా పేర్లను చేర్చింది. ఈ నేపథ్యంలో, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ వేశారు. విధానపరమైన నిర్ణయాలను తప్పుపడుతున్నారని పిటిషన్ లో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆధారాలు లేని కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. 

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇసుకను ఉచితంగా సరఫరా చేశారు. తవ్వకం, రవాణా ఖర్చులను మాత్రం ప్రజలు భరించారు. దీంతో, ఒక ట్రక్కు ఇసుక కేవలం రూ. 2 వేలకే ప్రజలకు చేరింది. ఇసుకను ఉచితంగా ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రూ. 1,300 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ, ఇసుక పాలసీపై ప్రభుత్వం తాజాగా కేసు నమోదు చేసింది. ఉచిత ఇసుకను కేబినెట్ సమావేశంలో చర్చించలేదని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. 


More Telugu News