బంగ్లాదేశ్ కు వరల్డ్ కప్ లో ఊరట విజయం

  • ఢిల్లీలో శ్రీలంక × బంగ్లాదేశ్
  • మొదట 49.3 ఓవర్లలో 279 పరుగులకు శ్రీలంక ఆలౌట్
  • 3 వికెట్ల తేడాతో గెలుపొందిన బంగ్లాదేశ్
  • కీలక భాగస్వామ్యంతో రాణించిన శాంటో, షకిబ్
నాసిరకం ఆటతో వరల్డ్ కప్ టోర్నీ నుంచి ఎప్పుడో నిష్క్రమించిన బంగ్లాదేశ్ జట్టుకు ఊరట విజయం లభించింది. ఇవాళ ఎలాంటి ప్రాధాన్యం లేని మ్యాచ్ లో శ్రీలంకపై 3 వికెట్ల తేడాతో నెగ్గింది.  

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌట్ అయింది. మిడిలార్డర్ లో చరిత్ అసలంక (108) సెంచరీతో మెరిశాడు. 

లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ జట్టు 41.1 ఓవర్లలో 7 వికెట్లకు 282 పరుగులు చేసి విజయభేరి మోగించింది. బంగ్లా గెలుపులో నజ్ముల్ హుస్సేన్ శాంటో, కెప్టెన్ షకిబ్ అల్ హసన్ భారీ భాగస్వామ్యంతో కీలక పాత్ర పోషించారు. శాంటో 101 బంతుల్లో 12 ఫోర్లతో 90 పరుగులు చేయగా, షకిబ్ 65 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. 

మహ్మదుల్లా 22, లిట్టన్ దాస్ 23 పరుగులు చేశారు. చివర్లో తౌహీద్ హృదయ్ 7 బంతుల్లో 2 సిక్సర్లతో 15 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో మధుశంక 3, తీక్షణ 2, ఏంజెలో మాథ్యూస్ 2 వికెట్లు తీశారు.


More Telugu News