ఏబీపీ-సీ వోటర్ సర్వే: తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..!

  • బీఆర్ఎస్ పార్టీకి 49 నుంచి 61 సీట్లు రావొచ్చునని సర్వేలో వెల్లడి
  • కాంగ్రెస్‌కు 43 నుంచి 55, బీజేపీకి 5 నుంచి 11 సీట్లు రావొచ్చునన్న సర్వే
  • కాంగ్రెస్, బీజేపీకి పెరగనున్న ఓటు శాతం, బీఆర్ఎస్‌కు తగ్గుదల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ఏబీపీ న్యూస్-సీ వోటర్ సర్వే నిర్వహించిన ఒపీనియన్ పోల్ వెల్లడించింది. అధికార బీఆర్ఎస్ పార్టీకి 49 నుంచి 61 సీట్లు రావొచ్చునని తెలిపింది. కాబట్టి స్పష్టంగా ఇప్పుడే విజేత ఎవరో చెప్పలేని పరిస్థితి అని ఈ సర్వేలో వెల్లడైంది. 2018 ఎన్నికల్లో ఘోర పరాజయంపాలైన కాంగ్రెస్ భారీగా పుంజుకుంటుందని వెల్లడైంది. సర్వే ప్రకారం 2018లో 28.3 శాతంగా ఉన్న కాంగ్రెస్ ఓట్ల శాతం ఇప్పుడు 39.4 శాతానికి పెరగవచ్చునని, బీఆర్ఎస్ పార్టీకి గత ఎన్నికల్లో 46.9 శాతం ఓట్లు రాగా, ఈసారి 40.6 శాతానికి తగ్గవచ్చునని అంచనా వేసింది. హైదరాబాద్‌లో మజ్లిస్ పార్టీ తన సీట్లను నిలుపుకోవచ్చునని వెల్లడించింది.

సర్వే ప్రకారం... బీఆర్ఎస్ 49 సీట్ల నుంచి 61 సీట్లు, కాంగ్రెస్ 43 నుంచి 55 సీట్లు, బీజేపీ 5 నుంచి 11 సీట్లు గెలుచుకుంటాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 సీట్లు గెలిచింది. ఈసారి దాదాపు 30 సీట్ల వరకు తగ్గవచ్చు. 2018లో కాంగ్రెస్ 19 సీట్లు గెలుచుకోగా ఈసారి రెండింతల కంటే ఎక్కువగా పెరగనున్నాయి. బీజేపీ గత ఎన్నికల్లో ఒక సీటు గెలవగా ఈసారి డబుల్ డిజిట్‌కు చేరువలో ఉంటోంది. ఇతరులు 4 నుంచి 10 సీట్లు గెలుచుకోవచ్చు. సీ వోటరు సర్వే 9,631 మంది అభిప్రాయాలు తీసుకుంది. 

కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో 28.3 శాతం ఓట్లు నమోదవగా, ఈసారి 39.4 శాతానికి, బీజేపీకి 7 శాతం నుంచి 14.3 శాతానికి పెరగవచ్చునని తెలిపింది. బీఆర్ఎస్‌కు 46.9 శాతం నుంచి 40.5 శాతానికి తగ్గే అవకాశముందని వెల్లడించింది. ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలని ప్రశ్నించగా 37 శాతం మంది కేసీఆర్, 31.2 శాతం మంది రేవంత్ రెడ్డి, 10.7 శాతం మంది బండి సంజయ్,  2.1 శాతం మంది అసదుద్దీన్ పేర్లు చెప్పారు.


More Telugu News