నా డీప్ ఫేక్ వీడియోపై స్పందించాల్సి రావడం తీవ్ర వేదన కలిగిస్తోంది: రష్మిక

  • సోషల్ మీడియాలో రష్మిక డీప్ ఫేక్ వీడియోల కలకలం
  • ఇదొక భయానక పరిస్థితి అంటూ విచారం వ్యక్తం చేసిన రష్మిక
  • టెక్నాలజీ దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన
  • ఈ అంశాన్ని సామాజికపరంగా చర్చించాలని విజ్ఞప్తి 
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోలు దర్శనమిస్తున్నాయి. మరొకరి అర్ధనగ్న శరీరానికి రష్మిక తలను ఏఐ పరిజ్ఞానంతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారు. రష్మికే ఆ వీడియోలో ఉందనేలా ఆ డీప్ ఫేక్ వీడియోలు రూపొందించారు. దీనిపై రష్మిక తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆన్ లైన్ లో కనిపిస్తున్న డీఫ్ ఫేక్ వీడియోలపై స్పందించాల్సి రావడం నిజంగా ఎంతో బాధ కలిగిస్తోందని తెలిపారు. 

"నిజాయతీగా చెప్పాలంటే ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం భయానకంగా అనిపిస్తోంది. నాకే కాదు, మనలో ప్రతి ఒక్కరికీ ఇలాంటి దారుణమైన పరిస్థితి పొంచి ఉంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తుండడమే అందుకు కారణం. ఇవాళ నేను ఒక మహిళగా, నటిగా నా కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారే నా రక్షణ వ్యవస్థలు... వారే నాకు వెన్నుదన్ను. ఇలాంటి పరిస్థితే నేను స్కూల్లోనో, కాలేజ్ లోనో చదువుకుంటున్నప్పుడు ఎదురైతే నేను ఏం చేయగలనన్నది ఊహకందని విషయం. అందుకే, ఇలాంటి విషయాలను వెంటనే సామాజికపరంగా చర్చకు పెట్టాలి. మరెంతో మంది ఈ డీప్ ఫేక్ వీడియోల బారినపడకుండా రక్షించాలి" అని రష్మిక పిలుపునిచ్చారు.


More Telugu News