ఎయిరిండియా ప్రయాణికులకు ఖలిస్థాన్ హెచ్చరికలు... తీవ్రంగా పరిగణిస్తున్న భారత్

  • నవంబరు 19న సిక్కులు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దని హెచ్చరిక
  • ప్రతి చోటా ఎయిరిండియా విమానాలను అడ్డుకుంటామన్న గురుపత్వంత్ సింగ్
  • ఈ హెచ్చరికలు కెనడా దృష్టికి తీసుకెళ్లిన భారత్
నవంబరు 19వ తేదీన ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించే వారికి ప్రమాదం తప్పదని ఖలిస్థాన్ వేర్పాటు వాది గురుపత్వంత్ సింగ్ (సిఖ్ ఫర్ జస్టిస్ సహ వ్యవస్థాపకుడు) హెచ్చరించడం పట్ల భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. నవంబరు 19న సిక్కులెవరూ ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దని, ఆ రోజున ప్రతి చోటా ఎయిరిండియా విమానాలను అడ్డుకుంటామని గురుపత్వంత్ సింగ్ స్పష్టం చేశాడు. 

అంతేకాదు, ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కూడా మూతపడుతుందని, ఆ విమానాశ్రయం పేరు మార్చేస్తామని ఓ వీడియోలో పేర్కొన్నాడు. 

ఇదంతా ఒకెత్తయితే, నవంబరు 19న అహ్మదాబాద్ లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుందన్న మాట గురుపత్వంత్ నోటి వెంట రావడం భారత కేంద్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసింది. వెంటనే ఈ విషయాన్ని కెనడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఎయిరిండియా విమానాలకు భద్రత కల్పించాలని కోరింది. 

దీనిపై కెనడాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ వివరాలు తెలిపారు. కెనడా-భారత్ మధ్య నడిచే ఎయిరిండియా విమానాలకు అదనపు భద్రత కల్పించాలని కెనడా ప్రభుత్వాన్ని కోరామని, సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. 

ఇప్పటికే కెనడాలో భారత దౌత్యవేత్తలకు ప్రమాదం పొంచి ఉందన్న నేపథ్యంలో, ఇప్పుడు ఎయిరిండియా విమానాలకు ముప్పు తప్పదని హెచ్చరికలు రావడంతో భారత్-కెనడా మధ్య మరింత అంతరం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్-కెనడా మధ్య సంబంధాలు క్షీణించడం తెలిసిందే. ఈ హత్య వెనుక భారత సీక్రెట్ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ఆరోపిస్తోంది.


More Telugu News