వన్డేల్లో సచిన్ సెంచరీల రికార్డును సమం చేయడంపై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు

  • ‘సచిన్ నా హీరో.. ఎప్పటికీ అంత గొప్ప ఆటగాడిని కాదు’ అని వ్యాఖ్య
  • టెండూల్కర్ అంతటి పరిపూర్ణమైన బ్యాటింగ్ తనదికాదని అభిప్రాయం
  • ఆయన రికార్డును సమం చేయడం ప్రత్యేక క్షణమని హర్షం
దక్షిణాఫ్రికాపై మ్యాచ్‌లో 49వ వన్డే సెంచరీ పూర్తి చేసుకున్న ‘పరుగుల యంత్రం’ విరాట్ కోహ్లీ.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. సచిన్ రికార్డ్ చేరుకోవడంపై విరాట్ ఆసక్తికరంగా స్పందించాడు. తాను ఎప్పటికీ సచిన్ టెండూల్కర్ అంత గొప్ప ఆటగాడిని కాదని విరాట్ వ్యాఖ్యానించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా ఎంపికైన అనంతరం ప్రజెంటేషన్‌ కార్యక్రమంలో కోహ్లీ మాట్లాడాడు. 

సచిన్ తన హీరో అని, ఆయన రికార్డును సమం చేయడం తనకు ప్రత్యేకమైన క్షణమని హర్షం వ్యక్తం చేశాడు. సచిన్ అంతటి పరిపూర్ణమైన బ్యాటింగ్ తనదికాదని, క్రికెట్ లెజెండ్ ఎప్పటికీ తన హీరోయేనని వ్యాఖ్యానించాడు. 49వ సెంచరీ తర్వాత సచిన్ నుంచి ప్రత్యేక సందేశాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని వివరించాడు. తాను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసునని, మైదానంలో నిలబడి సచిన్ ప్రశంసలు అందుకోవడం గొప్పగా ఉందని కోహ్లీ వ్యాఖ్యానించాడు.

పుట్టినరోజు నాడే 49వ రికార్డ్ సెంచరీ సాధించడంపై కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇంతటి అభిమానం ఒక కలలాగా ఉందని వ్యాఖ్యానించాడు. కాగా దక్షిణాఫ్రికాపై మ్యాచ్‌లో కోహ్లీ 119 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్ భారీ స్కోరు సాధించడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.


More Telugu News