పొల్యూషన్ ఎఫెక్ట్.. ఢిల్లీలో స్కూళ్లకు సెలవు

  • ఈ నెల 10 వరకు ఆన్ లైన్ లో బోధించాలని ప్రభుత్వం ఆదేశాలు
  • 6, 7 తరగతులు కొనసాగించవచ్చని సూచన
  • ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ మంత్రి ఆతిషి
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. గాలి నాణ్యత కనిష్ట స్థాయులకు పడిపోవడంతో ఆప్ సర్కారు పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రైమరీ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఇప్పటికే ఈ నెల 5 వరకు సెలవులు ప్రకటించగా.. ప్రస్తుతం ఈ నెల 10 వరకు పొడిగించింది. గాలి నాణ్యత మెరుగుపడక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 5 వ తరగతి వరకు ఆన్ లైన్ లో పాఠాలు బోధించాలని స్కూళ్ల యాజమాన్యాలకు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి ఉత్తర్వులు జారీ చేశారు. 6, 7 తరగతుల విద్యార్థుల విషయంలో స్కూల్ బంద్ పెట్టాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. అయితే, విద్యార్థులు ఆన్ లైన్ విధానంలో చదువుకుంటామని చెబితే ఆమేరకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఆదివారం ఉదయం కూడా ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడలేదు. ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 460 పాయింట్లుగా నమోదైంది. ఢిల్లీని కాలుష్యపు పొగ మంచు కప్పేసింది. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లిన వారు శ్వాసకోశ సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు ఇంటికే పరిమితం కావాలని సూచిస్తున్నారు. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే మాస్క్ ధరించడంతో పాటు ఇతరత్రా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


More Telugu News