హాంబర్గ్ విమానాశ్రయంలోకి సాయుధ వాహనంతో దూసుకెళ్లిన దుండగుడు

  • టార్మాక్‌పై వాహనాన్ని నిలిపిన దుండగుడు
  • బంధీలుగా ఉన్న ఇద్దరు పిల్లలు
  • హాంబర్గ్ ఎయిర్‌పోర్టులో విమాన సేవలు నిలిపివేత
జర్మనీలోని హాంబర్గ్ ఎయిర్‌పోర్టులో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయుధాలతో కూడిన వాహనంతో ఓ వ్యక్తి ఎయిర్‌పోర్టు లోపలికి దూసుకెళ్లాడు. సెక్యూరిటీని దాటుకొని వాహనాన్ని ఎయిర్‌పోర్టు టార్మాక్‌పైకి తీసుకెళ్లి నిలిపాడు. నిందితుడు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడని, మండుతున్న బాటిల్ ఒక దానిని బయటకు విసిరేశాడని పోలీసులు ప్రకటించారు. వాహనంలో ఇద్దరు చిన్నారులు బంధీలుగా ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.     

జర్మనీ కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే ప్రత్యేక బలగాలు అక్కడికి చేరుకున్నాయి. కాగా నిందితుడి భార్య పిల్లలు కనిపించడంలేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తోందని, దంపతుల మధ్య పిల్లల సంరక్షణకు సంబంధించిన వివాదం అయ్యుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా వివరాలు వెల్లడించారు. కాగా ఈ అనూహ్య పరిస్థితి కారణంగా హాంబర్గ్ విమానాశ్రయంలోని అన్ని విమానాలు సర్వీసులు ప్రస్తుతానికి నిలిచిపోయాయి. అన్ని టెర్మినల్స్‌పై ప్రవేశాలను మూసివేశారు. ప్రస్తుతానికి సర్వీసుల పునరుద్ధరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.


More Telugu News