‘మైవిలేజ్‌షో’ టీమ్‌తో కలిసి నాటుకోడి కూర వండిన మంత్రి కేటీఆర్

  • గంగవ్వ, అనిల్‌, అంజి, చందులతో మాట మంతి
  • వంట పనుల్లో చురుగ్గా పాల్గొన్న మంత్రి కేటీఆర్
  • ఎన్నికల ప్రచారం వేళ పలు అంశాలపై వివరణ
రాజకీయ వ్యవహారాలు, ప్రభుత్వ కార్యకలాపాలతో ఎల్లప్పుడూ బిజీబిజీగా గడిపే తెలంగాణ మంత్రి కేటీఆర్ నాటుకోడి కూర వండారు. ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగుతున్న వేళ తెలంగాణలో విశేష ఆదరణ ఉన్న ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ టీమ్‌తో కలిసి హైదరాబాద్‌ శివారులో వంట పనుల్లో స్వయంగా పాల్గొని భోజనం చేశారు. కేటీఆర్ జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లెకు చెందిన ‘మైవిలేజ్‌షో’ టీమ్‌కు చెందిన గంగవ్వ, అనిల్‌, అంజి, చందు పాల్గొన్నారు. వారితో పలు అంశాలపై మాట్లాడారు. కేటీఆర్ టమాటాలు కట్ చేయడంతోపాటు వంట పనుల్లో యాక్టివ్‌గా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

వంట చేస్తూ పలు అంశాలపై కేటీఆర్ మాట్లాడారు. ఏ ప్రభుత్వమైనా అందరికీ  గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించలేదని, అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉంటారని అన్నారు. అందుకే  ప్రైవేటు రంగంలో పెట్టుబడుల ద్వారా అందరికీ ఉపాధి అందించే ప్రయత్నాలు చేస్తాయని వెల్లడించారు. రైతుబంధు, రైతు భీమా పథకాలు ప్రపంచంలో ఎక్కడాలేవని ‘మై విలేజ్ షో’ సభ్యులకు చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత బతుకు మీద విశ్వాసం పెరిగిందని అన్నారు. 24 గంటల కరెంట్ అందుతోందని చెప్పారు. రైతులు సన్నబియ్యం పండించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. 

వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ.. అందరి ఇళ్లలో మాదిరిగానే తమ ఇంట్లోనూ దసరా జరిగిందని అన్నారు. 8 ఏళ్లు అమెరికాలో ఉన్నానని, అక్కడ తన పనులు తానే చేసుకున్నానని వివరించారు. గంగవ్వతో ఎవరూ పోటీ పడలేరని సరదాగా అన్నారు. మంత్రి మల్లారెడ్డి ఒక్కరే పోటీ పడగలరంటూ నవ్వించారు. గంగవ్వ జీవితం గురించి విన్న కేటీఆర్ ఆమెను మెచ్చుకున్నారు. లంబాడిపల్లె గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా మార్చడంతోపాటు రహదారుల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


More Telugu News