3.6 తీవ్రత భూకంపంతో ఉలిక్కిపడిన అయోధ్య

  • ఆదివారం రాత్రి 1 గంట సమయంలో సంభవించిన భూకంపం
  • అయోధ్యకు 215 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం
  • వివరాలు వెల్లడించిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం ఆదివారం (నవంబర్ 5) రాత్రి 1 గంట సమయంలో భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం స్థానికులను కలవరపరిచింది. అయోధ్యకు ఉత్తరాన 215 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్ఎస్‌సీ) వెల్లడించింది. ప్రాణ, ఆస్తి నష్టం ఏమీ నమోదు కాలేదు.

భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 1 గంట 7 నిమిషాలకు ఇది సంభవించిందని, అక్షాంశం: 28.73, పొడవు: 82.26, లోతు: 10 కి.మీ అని వివరాలు వెల్లడించింది. కాగా శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర భూకంపం నేపాల్‌ను వణికించిన విషయం తెలిసిందే. పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. ఈ ప్రకంపనలు భారత్‌లోని ఢిల్లీ రాజధాని ప్రాంతం, ఉత్తర భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనిపించిన విషయం తెలిసిందే.


More Telugu News