మాకు 80 సీట్లు దాటడం ఖాయం... కేసీఆర్‌కు బీఆర్ఎస్ గెలవదని అర్థమైంది: మల్లు భట్టి విక్రమార్క

  • కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న విక్రమార్క
  • మేడిగడ్డ బ్యారేజీ పని చేయని స్థితికి వచ్చిందని కేంద్ర బృందం చెప్పిందన్న కాంగ్రెస్ నేత
  • మొత్తం బ్లాక్‌లను పునాదులతో తొలగించి పునర్నిర్మించాలని పేర్కొందని వెల్లడి
మేడిగడ్డ బ్యారేజీపై 15 నుంచి 20వ పిల్లర్ వరకు కుంగిపోయాయని, ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని కాంగ్రెస్ పార్టీ నేత, సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మధిరలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందని బీఆర్ఎస్ మంత్రులు, నేతలు అనడం విడ్డూరంగా ఉందన్నారు. అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. ఇంకా మేడిగడ్డలో ఏం జరిగిందో బయటకు చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. ఈ ప్రాజెక్టుపై ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని చెప్పడం సరికాదన్నారు. ఎంతో గొప్పగా నిర్మించామని బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పిందని, కానీ అప్పుడే పిల్లర్లు కుంగిపోయాయన్నారు.

మున్ముందు బ్యారేజీతో ముప్పు ఉందని కేంద్ర బృందం చెప్పిందన్నారు. మొత్తం బ్యారేజీ పని చేయని స్థితికి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఏడో బ్లాక్ రిపేర్ చేయడానికి కూడా వీలులేకుండా ఉందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందన్నారు. మొత్తం బ్లాక్‌లను పునాదులతో సహా తొలగించి పునర్నిర్మించాలని పేర్కొంది. ఈ సమస్యను పరిష్కరించే వరకు బ్యారేజీని ఉపయోగించే పరిస్థితి కూడా లేదన్నారు. ఒకవేళ ఉపయోగిస్తే మొత్తం బ్యారేజీని పునర్నిర్మించే పరిస్థితి రావొచ్చని బృందం చెప్పిందన్నారు.

బీఆర్ఎస్ అధికారంలోకి రాదని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు ఇప్పటికే అర్థమైందన్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతోందన్నారు. ఇటీవల తమ పార్టీకి 80 సీట్లు వస్తాయని భావించామని, కానీ ప్రజాస్పందన చూస్తుంటే ఈ మార్క్ దాటుతుందని అర్థమైందన్నారు. కాంగ్రెస్ వస్తే ఐదు గంటల విద్యుత్ మాత్రమే ఇస్తారని, రైతుబంధు రాదని బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయన్నారు. అధికారంలోకి రాగానే వీటిని అమలు చేస్తామన్నారు. సీపీఐతో పొత్తుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయన్నారు.


More Telugu News