మాట నిలుపుకున్న ప్రధాని మోదీ... ఛత్తీస్ గఢ్ చిన్నారికి లేఖ

  • ఇటీవల ఛత్తీస్ గఢ్ లో ప్రధాని మోదీ ఎన్నికల సభ
  • ఓ బాలిక చేతిలో మోదీ స్కెచ్ తో నిల్చున్న వైనం
  • మోదీ దృష్టిని ఆకర్షించిన బాలిక
  • తప్పకుండా లేఖ రాస్తానని చెప్పిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఓ చిన్నారికి ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. ఆ మేరకు ఆ బాలికకు లేఖ రాశారు. ఇటీవల మోదీ ఛత్తీస్ గఢ్ లో నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొన్నారు. కంకేర్ లో ఏర్పాటు చేసిన ఆ సభలో ఓ బాలిక మోదీ స్కెచ్ ను ప్రదర్శించింది. ఆ బాలిక పేరు ఆకాంక్ష ఠాకూర్. 

మోదీ ప్రసంగిస్తుండగా, ఆ అమ్మాయి చేతిలో స్కెచ్ తో కెమెరాల దృష్టిని ఆకర్షించింది. ప్రధాని మోదీ కూడా ఆ బాలికను గుర్తించి, ఆ అమ్మాయి అభిమానాన్ని వేదిక పై నుంచి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వివరంగా లేఖ రాస్తానని చెప్పారు. మోదీ మాట ఇచ్చినట్టుగానే... ఆకాంక్ష ఠాకూర్ కు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి లేఖ వచ్చింది. 

"ప్రియాతిప్రియమైన ఆకాంక్ష ఠాకూర్... కంకేర్ సభకు నువ్వు తీసుకొచ్చిన స్కెచ్ నాకు చాలా నచ్చింది. నీ అభిమానాన్ని తెలియజేసిన విధానానికి ధన్యవాదాలు. నీకు ఎల్లప్పుడూ అదృష్టం, ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మీరు భారతదేశపు ప్రియ పుత్రికలు. దేశానికి ఉజ్వల భవిష్యత్తు మీరే. మీ నుంచి నేను పొందుతున్న ఈ అభిమానం, అనుబంధం దేశ సేవ చేసేందుకు నాకు కొండంత బలాన్ని ఇస్తున్నాయి. భరతమాత ప్రియ పుత్రికల కోసం ఆరోగ్యదాయకమైన, సురక్షిత, సుసంపన్న భారత్ ను నిర్మించడమే మా లక్ష్యం. 

నేను ఎప్పుడు ఛత్తీస్ గఢ్ వచ్చినా ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మీ వంటి పుత్రికలు సంచలనాలు నమోదు చేస్తూ దేశ భవిష్యత్తుకు కొత్త దిశను అందిస్తున్నారు. కష్టపడి చదివి ఉన్నతస్థాయికి ఎదగండి... మీ విజయసాధనతో మీ కుటుంబాలకు, దేశానికి, సమాజానికి అపారమైన కీర్తి ప్రతిష్ఠలు అందించండి. మీ దివ్యమైన భవిష్యత్తుకు శుభాకాంక్షలు" అంటూ ప్రధాని మోదీ తన లేఖలో పేర్కొన్నారు.


More Telugu News