కేసీఆర్, హరీశ్ రావులను వెంటనే పదవుల నుంచి తొలగించి, అరెస్ట్ చేయాలి: రేవంత్ రెడ్డి

  • కాళేశ్వరం ప్రాజెక్టుకు తానే కర్త, కర్మ, క్రియ అని కేసీఆరే చెప్పారన్న రేవంత్ రెడ్డి
  • ఇప్పుడు పిల్లర్ కుంగిపోగానే సాంకేతిక నిపుణుల మీదకు తోసేసే పనిలో ఉన్నారని విమర్శ
  • రీడిజైన్ పేరుతో భారీ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపణ
  • కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది అని తేలిందని విమర్శలు
కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తానికి తానే కర్త, కర్మ, క్రియ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని, తానే ఆలోచన చేసి రక్తం ధారపోసి కాళేశ్వరం కట్టినట్లు చెప్పారని, ఇప్పుడు పిల్లర్ కుంగిపోగానే సాంకేతిక నిపుణుల మీదకు తోసేసే పనిలో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ అవినీతి బయటపడిందన్నారు. రీడిజైన్ పేరుతో భారీ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది అని తేలిందని, ఆర్థిక నేరం కింద ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. డిజైన్ అనుకున్నదొకటి... చేసింది మరొకటి అన్నారు.

మేడిగడ్డ డొల్లతనం కేంద్ర బృందం బయటపెట్టిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.38,500 కోట్లు కాగా, దానిని లక్షా యాభై వేల కోట్ల రూపాయలకు పెంచారన్నారు. ఇప్పటికీ యాభై శాతానికి పైగా పనులు పూర్తి కాలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కూడా కేసీఆర్‌ను కాపాడే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇతర రాష్ట్రాల అధికారులతో కమిటీ వేసి ప్రాజెక్టు మొత్తాన్ని పరిశీలించాలన్నారు. 2014 నుంచి 2023 వరకు ఈ ప్రాజెక్టు వెనుక కేసీఆర్, హరీశ్ రావు ఉన్నారని, వారిద్దర్నీ వెంటనే పదవుల నుంచి తొలగించాలన్నారు.


More Telugu News