ప్రపంచకప్ భారత్‌దే.. తెలంగాణ కేసీఆర్‌దే: కేటీఆర్

  • ఈ ఎన్నికల్లో బీజేపీ రేసులో లేదన్న కేటీఆర్
  • నూటికి నూరుశాతం కాంగ్రెస్‌తోనే పోటీ అని స్పష్టీకరణ
  • కాళేశ్వరం ప్రాజెక్టును వారు కట్టలేదన్న ఈర్ష్యతోనే విమర్శలన్న మంత్రి
  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం మళ్లీ అంధకారమేనని విమర్శ
  • తమ సంక్షేమ ఫలాలు 90 శాతం మందికి అందాయని స్పష్టీకరణ
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో భారతజట్టు విజయం సాధిస్తుందని, తెలంగాణ శాసనసభకు జరిగే ఎన్నికల్లో కేసీఆర్ గెలిచి మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఈనాడు’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఈ ఎన్నికల్లో బీజేపీ రేసులోనే లేదన్న కేటీఆర్.. తమ ప్రత్యర్థి ముమ్మాటికీ కాంగ్రెస్సేనని స్పష్టం చేశారు. నిన్నమొన్నటి వరకు బలహీనంగా ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం కొంత బలపడిందన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ కష్టాలు, కన్నీళ్లు, అంధకారం, మతకలహాలతో అరాచకం తప్పదని హెచ్చరించారు. 

తాము ఎవరికీ బీ టీం కాదని కేటీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బీజేపీల మెడలు వంచడం ఖాయమని హెచ్చరించారు. ఈ ఎన్నికలు దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్నవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అన్నారని, కానీ ఈ ఎన్నికలు ఢిల్లీ దొరలకు, నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్నవని కేటీఆర్ అభివర్ణించారు. 

కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృత్తి ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. తమ ప్రభుత్వ వ్యక్తిగత సంక్షేమం, అభివృద్ధి ఫలాలు దాదాపు 90 శాతం మందికి అందాయని, మెజారిటీ ప్రజలు తమతో ఉన్నారని పేర్కొన్నారు. మళ్లీ గెలిస్తే సంపదను పెంచి దానిని ప్రజలకు అందిస్తామని, అదే తమ లక్ష్యమని వివరించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందన్న కాంగ్రెస్ ఆరోపణలపై స్పందిస్తూ.. ఆ ప్రాజెక్టును కట్టింది కేసీఆర్ కాబట్టి సహజంగానే ఆ ఏడుపు, అసూయ ఉంటాయని విమర్శించారు. ఎన్నికల ముందు వరకు బీజేపీని విమర్శించి, ఇప్పుడు అకస్మాత్తుగా కాంగ్రెస్‌ను టార్గెట్ చేయడానికి గల కారణాన్ని వివరిస్తూ.. బీజేపీ పోటీ లేదని, కాంగ్రెస్ పోటీలోకి రావడంతోనే ఆ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని వివరించారు.


More Telugu News