నాలుగేళ్లకే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారింది: కిషన్ రెడ్డి

  • ప్రాజెక్టు నిర్మాణం కోసం నాణ్యమైన మెటీరియల్‌ ఉపయోగించలేదని డ్యామ్ సేఫ్టీ బృందం చెప్పిందన్న కిషన్ రెడ్డి
  • కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై న్యాయ విచారణకు కేసీఆర్ సిద్ధమా? అని సవాల్
  • కేంద్రం అడిగిన వివరాలను ఎందుకు దాచిపెడుతుందని ప్రశ్న
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నాణ్యమైన మెటీరియల్‌ను ఉపయోగించలేదని డ్యామ్ సేఫ్టీ బృందం చెప్పిందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... డిజైన్, నిర్వహణ లోపాల కారణంగా నాలుగేళ్లకే ఈ ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రూ.1.20 లక్షల కోట్లతో కట్టిన ప్రాజెక్టులో చుక్క నీరు నిల్వ చేసే పరిస్థితి లేదన్నారు. ఈ ప్రాజెక్టు అవినీతిపై న్యాయవిచారణకు ఆదేశించాలన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే సమగ్ర విచారణకు ముందుకు రావాలన్నారు.

అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టు కట్టామని చెప్పారని, కానీ అందుకు సంబంధించి వివరాలు లేవనడం హాస్యాస్పదమన్నారు. సరైన ఫౌండేషన్ లేకుండానే ప్రాజెక్ట్ నిర్మాణం సరికాదన్నారు. ఈ ప్రాజెక్టు ఫౌండేషన్ నిర్మాణం బాధ్యతారాహిత్యంగా జరిగినట్లు కేంద్ర బృందం తెలిపిందన్నారు. ఇంజనీర్ల మాట లెక్కచేయకుండా ఇష్టారీతిన ప్రాజెక్టును నిర్మించారన్నారు. మేడిగడ్డ నుంచి ఇప్పటికే పది టీఎంసీల నీటిని వృథాగా వదిలేశారన్నారు. డిజైనింగ్‌లో లోపం ఉందని తాము మొదటి నుంచి చెబుతున్నామని, దీంతో మున్ముందు ప్రజలకు తీరని నష్టం కలిగిస్తుందని ఇంజినీర్లు చెప్పారని తెలిపారు. కేంద్రం అడిగిన వివరాలను రాష్ట్రం ఎందుకు దాచి పెడుతోందన్నారు.

కేసీఆర్ మార్క్ పాలన అంటూ ట్వీట్

అవినీతి... ప్రాజెక్టుల వైఫల్యం... లీకేజీలు... ఇవన్నీ కేసీఆర్ మార్కు పాలనలో సర్వసాధారణం అయిపోయాయంటూ కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. లీకేజీ, పిల్లర్లు కుంగిపోయిన నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన తర్వాత కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు..  కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల్లోనూ ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణ, నిర్వహణ లోపాలున్నాయని స్పష్టం చేశారన్నారు.


More Telugu News