తెలంగాణ ప్రకటన వస్తే భోజనం మానేసిన పవన్ కల్యాణ్‌తో బీజేపీ కలిసింది: హరీశ్ రావు

  • పవన్ కల్యాణ్, షర్మిల తెలంగాణ ద్రోహులని విమర్శలు
  • తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ కూతురు షర్మిల అని మండిపాటు
  • చంద్రబాబు కూడా లోలోపల కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారని చెబుతున్నారని వెల్లడి
తెలంగాణ ప్రకటన చేస్తే తాను భోజనం మానేశానని చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో బీజేపీ ఇక్కడ జత కలుస్తోందని మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. శుక్రవారం సంగారెడ్డిలో కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల కోసం పవన్‌తో బీజేపీ, షర్మిలతో కాంగ్రెస్ జట్టు కట్టాయని అన్నారు. పవన్, షర్మిల... ఇద్దరూ తెలంగాణ ద్రోహులు అని ఆరోపించారు. ఆ రోజు తెలంగాణ ప్రకటిస్తే భోజనం మానేశానని చెప్పిన జనసేనానితో బీజేపీ ఎలా కలుస్తుందన్నారు.

అలాగే, తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు షర్మిల అని, ఆమె కాంగ్రెస్ వైపు ఉందన్నారు. తెలంగాణ ఇవ్వమని కొట్లాడితే ఇవ్వడానికి అది సిగరెట్టా..? బీడియా...? అని వైఎస్ ఆనాడు అన్నాడని గుర్తు చేశారు. తాను బతికుండగా తెలంగాణ రాదన్నారని తెలిపారు. తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ కూతురు షర్మిల ఇప్పుడు కాంగ్రెస్‌కు మద్దతిస్తోందన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా లోలోపల కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారని తెలిసిందని, ఓట్లు చీలవద్దనే టీడీపీ ఇక్కడ పోటీ చేయడం లేదంట అని అన్నారు. మనకు స్ట్రాంగ్ లీడర్ కేసీఆర్ ఉండగా, రాంగ్ లీడర్లు అవసరమా? అని నిలదీశారు.


More Telugu News