బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేస్తుంటే.. పియానోపై హనుమాన్ చాలీసా వాయించాడు.. వీడియో ఇదిగో!

బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేస్తుంటే..  పియానోపై హనుమాన్ చాలీసా వాయించాడు.. వీడియో ఇదిగో!
  • భోపాల్ ఎయిమ్స్‌లో ఘటన
  • రోగి వయసు చిన్నది కావడంతో మెలకువలో ఉంచే శస్త్రచికిత్స
  • ఆపరేషన్ విజయవంతం.. త్వరగా కోలుకుంటున్న రోగి
  • ఇటీవలి కాలంలో పాప్యులర్ అయిన అవేక్ క్రామియోటోమిస్ విధానం
భోపాల్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఓ వ్యక్తి పియానోపై హనుమాన్ చాలీసా వాయిస్తూ బ్రెయిన్ ట్యూమర్‌కు సర్జరీ చేయించుకున్నాడు. రోగికి  మత్తుమందు ఇవ్వకుండా అతడిని మెలకువలో ఉంచే అతడి మెదడులోని ట్యూమర్‌ను వైద్యులు విజయవంతంగా తొలగించారు. బీహార్‌లోని బక్సర్‌కు చెందిన 28 ఏళ్ల వ్యక్తి తరచూ మూర్ఛపోతుండడంతో వైద్యులను సంప్రదించాడు. పరీక్షించిన వైద్యులు బ్రెయిన్‌లో కణతి వల్లే అలా జరుగుతున్నట్టు గుర్తించారు. 

రోగి వయసు చిన్నది కావడం, అతడి మోటార్ కార్టెక్స్‌కు ట్యూమర్ అతి సమీపంలో ఉండడంతో భౌతిక కదలికలు నియంత్రించే మెదడు ప్రాంతాన్ని చేతనావస్థలో ఉంచి ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రమాద తీవ్రతను తగ్గించే ప్రయత్నంలో భాగంగానే వైద్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఆపరేషన్‌ బెడ్‌పై ఉన్న రోగి పియానో కీబోర్డుపై హనుమాన్ చాలీసా వాయిస్తుండగా వైద్యులు ఆపరేషన్ కొనసాగించారు. అతడి ముఖంలో ఎలాంటి ఒత్తిడి కానీ, ఆందోళన కానీ కనిపించకపోవడం గమనార్హం. వైద్యులు అతడితో మాట్లాడుతూనే క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయంతంగా పూర్తిచేశారు.  రోగి సాధారణంగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో అలానే ఉంటూ న్యూస్ పేపర్ కూడా చదివాడు. హనుమాన్ చాలీసా పఠించాడు. 

ట్యూమర్‌ను విజయవంతంగా తొలగించామని, పేషెంట్ కోలుకుంటున్నాడని ఆపరేషన్‌లో పాలుపంచుకున్న న్యూరోసర్జరీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుమీత్ రాజ్ తెలిపారు. ఆపరేషన్ సమయంలో మరింత మెరుగైన ఫలితాల కోసం రోగిని మెలకువలోనే ఉంచి శస్త్రచికిత్స చేసే విధానం ఇటీవల బాగా పాప్యులర్ అయింది. 


More Telugu News