మధుమేహ రోగులకు గొప్ప శుభవార్త.. ఇక ఇన్సులిన్ ఎక్కించుకునే వారికి సూది గుచ్చుకోవాల్సిన పనిలేదు!

  • హైదరాబాద్ సంస్థ నీడిల్ ఫ్రీ టెక్నాలజీస్ ఘనత
  • ఇన్సులిన్ స్ప్రే ‘ఓజులిన్’ అభివృద్ధి
  • 40కిపైగా దేశాల్లో అంతర్జాతీయ పేటెంట్లు
మధుమేహంతో బాధపడుతూ నిత్యం ఇన్సులిన్ ఎక్కించుకునే వారికి ఇది శుభవార్తే.  సూది ద్వారా ఇన్సులిన్ ఎక్కించుకునే కష్టాలు ఇక తీరనున్నాయి. హైదరాబాద్‌కు చెందిన నీడిల్ ఫ్రీ టెక్నాలజీస్ సూదితో పనిలేకుండా నోటి ద్వారా తీసుకునే ఇన్సులిన్ స్ప్రే ‘ఓజులిన్’ను అభివృద్ధి చేసింది. 40కిపైగా దేశాల్లో ఇప్పటికే దీనికి అంతర్జాతీయ పేటెంట్ లభించింది. 

మన దేశంలో దీనికి భద్రతా పరమైన పరీక్షల కోసం సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో)కు కంపెనీ దరఖాస్తు చేసుకుంది. ఈ స్ప్రే కనుక అందుబాటులోకి వస్తే మధుమేహ చికిత్సలో నొప్పిలేని ప్రత్యామ్నాయం లభించినట్టే. దీనిని మనుషులతోపాటు జంతువులకూ ఉపయోగించవచ్చు. ఇటీవల శునకాలపై నిర్వహించిన పరీక్షల్లో 91 శాతానికిపైగా బయో అవైలబులిటీని ఓజులిన్ ప్రదర్శించింది.

కేన్సర్, ఆస్టియోపోరోసిస్, అల్జీమర్స్ వంటి వ్యాధుల చికిత్స కోసం రూ. 1845-2050 కోట్ల పెట్టుబడులు సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు నీడిల్ ఫ్రీ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు, ట్రాన్స్‌జీన్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కే కోటేశ్వరరావు తెలిపారు. కాగా, 2024-25 నాటికి కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు కూడా ఓరల్ ఇన్సులిన్ స్ప్రేను ఆవిష్కరించేందుకు కంపెనీ ప్రయత్నాలు ప్రారంభించింది.


More Telugu News