కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై 100 మంది పౌల్ట్రీ రైతుల పోటీ

  • పౌల్ట్రీ రైతుల అసోసియేషన్ ప్రకటన
  • గురువారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో నిర్ణయం
  • ఇప్పటికే 1016 నామినేషన్లు వేస్తామని ప్రకటించిన కాయితీ లంబాడీలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం శుక్రవారం (నేడు) మొదలుకానుంది. శుక్రవారమే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా షురూ అవుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ పత్రాలను అధికారులు స్వీకరించనున్నారు. నామినేషన్ దాఖలుకు పోటీ చేయబోయే అభ్యర్థులు సమాయత్తమవుతున్న తరుణంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

సీఎం కేసీఆర్ ఈసారి పోటీ చేస్తున్న రెండవ నియోజకవర్గం కామారెడ్డి బరిలో నిలిచేవారి సంఖ్య భారీగా పెరిగేలా కనిపిస్తోంది. సీఎం కేసీఆర్‌పై పోటీ చేసేందుకు 100 మంది పౌల్ట్రీ రైతులు నామినేషన్ వేయనున్నట్టు ప్రకటించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పౌల్ట్రీ రైతుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ మేరకు రైతులు నిర్ణయించుకున్నారు. అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రావు, ఇంటిగ్రేటెడ్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డితోపాటు పలువురు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. కేసీఆర్‌పై 100 మంది పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదిలావుండగా కేసీఆర్‌పై పోటీకి 1,016 నామినేషన్లు వేస్తామని కాయితీ లంబాడీలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిస్తే ఆ ప్రభావం ఏవిధంగా ఉంటుందో వేచిచూడాల్సిందే.


More Telugu News