చంద్రబాబుపై ఇంకో కేసు నమోదు చేసిన సీఐడీ
- ఇప్పటికే 4 కేసులు ఎదుర్కొంటున్న చంద్రబాబు
- తాజాగా 5వ కేసు నమోదు
- టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలు జరిగాయని ఏపీఎండీసీ ఫిర్యాదు
- ఏపీఎండీసీ ఫిర్యాదుతో సీఐడీ కేసు... ఏ2గా చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ అధికారులు తాజాగా మరో కేసు నమోదు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలు జరిగాయంటూ ఏపీఎండీసీ చేసిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. ఇందులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబులను పేర్కొన్నారు. ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమల పేర్లను చేర్చారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చేలా వ్యవహరించారని ఏపీఎండీసీ చేసిన ఫిర్యాదును సీఐడీ స్వీకరించింది. ఇప్పటికే పలు కేసులను ఎదుర్కొంటున్న చంద్రబాబుపై ఇది 5వ కేసు. చంద్రబాబుపై ఇప్పటివరకు స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, మద్యం అనుమతుల కేసు నమోదైన సంగతి తెలిసిందే.