స్కిల్ కేసులో 50 రోజుల తర్వాత కూడా ఏం తేల్చలేకపోయారు: పయ్యావుల కేశవ్

  • స్కిల్ కేసులో 50 పైసల అవినీతిని కూడా చూపలేకపోయారన్న కేశవ్ 
  • సీమెన్స్ తో నాడు కేంద్రం కూడా ఒప్పందం కుదుర్చుకుందన్న పయ్యావుల
  • మరి కేంద్రంపైనా ఈడీ విచారణ చేయిస్తారా? అంటూ వ్యాఖ్యలు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 50 రోజులైనా ఏమీ తేల్చలేకపోయారని టీడీపీ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. కనీసం 50 పైసల అవినీతిని కూడా ఈ ప్రభుత్వం చూపలేకపోయిందని విమర్శించారు. స్కిల్ అంశంలో, నిధుల విడుదలకు ముందే 10 శాతం పెట్టుబడి అనే విషయం స్పష్టంగా ఉందని వెల్లడించారు. 

సీమెన్స్ సంస్థతో కేంద్ర ప్రభుత్వం 2017లోనే ఒప్పందం కుదుర్చుకుందని, కేంద్రం కూడా 90:10 నిష్పత్తిలోనే ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఇది మంచి ఒప్పందం అని కేంద్ర కార్యదర్శి లేఖ కూడా రాశారని పయ్యావుల వివరించారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ ఒప్పందంపైనా ఈడీతో విచారణ చేయించాలంటారా? అని ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. 

జర్మనీ సంస్థ సీమెన్స్ కు వైసీపీ ప్రభుత్వం లేఖ రాసిందా? ఒకవేళ సీమెన్స్ కు లేఖ రాస్తే సమాధానమిచ్చింది ఎవరు? అని ప్రశ్నించారు. నాడు, గ్రాంట్ ఇన్ కైండ్ పేరుతో రాయితీ ఇస్తున్నట్టు సీమెన్స్ తెలిపిందని పయ్యావుల వెల్లడించారు. పదాల వాడుకలో తప్పిదాన్ని చూపించి అవినీతి అంటారా? అంటూ మండిపడ్డారు. సాధారణంగా జరిగే ప్రక్రియలో సంతకాలను కూడా తప్పిదం అంటారా? అంటూ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

స్కిల్ ప్రాజెక్టు అద్భుతమని ఐఏఎస్ అధికారులు సునీత, పీవీ రమేశ్ నోట్ ఫైళ్లు రాశారని స్పష్టం చేశారు. చంద్రబాబు తప్పు చేశారని ఒక్క ఆధారం చూపలేక ఏపీ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని ఆయన పేర్కొన్నారు.


More Telugu News