ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? అని అడగగా బీజేపీ నేత డాక్టర్ కే లక్ష్మణ్ సమాధానం ఇదే

  • ముఖ్యమంత్రిగా మాత్రం బీసీనే చేస్తామని స్పష్టం చేసిన లక్ష్మణ్
  • మిగతా పార్టీల కంటే ఎక్కువ మంది బీసీలకు తాము టిక్కెట్లు ఇస్తామన్న బీజేపీ ఎంపీ
  • బీసీలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచన
  • జనసేన ఎన్డీయేలో భాగస్వామి... కలిసి ముందుకు సాగుతున్నట్లు వెల్లడి
  • 163 మంది బీసీలను ఎమ్మెల్సీలుగా చేసిన ఘనత బీజేపీదే అన్న లక్ష్మణ్
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు బడుగు, బలహీన వర్గాలకు అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ఎన్నికల తర్వాత పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని, కానీ కచ్చితంగా బీసీనే సీఎంగా చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 7న బీసీ ఆత్మగౌరవ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏ పార్టీ కూడా బీసీలకు కనీసం 30 సీట్లు ఇవ్వలేదని, కానీ తాము మాత్రం మిగతా పార్టీల కంటే ఎక్కువ సీట్లు ఇస్తామన్నారు. గెలుపు గుర్రాలకే టిక్కెట్ ఇస్తామన్నారు. బీసీ ముఖ్యమంత్రి అనే అంశాన్ని బీసీలు, ఇతర వర్గాలు సదవకాశంగా తీసుకోవాలని సూచించారు. వచ్చిన అవకాశాన్ని యావత్ బీసీ సమాజం జారవిడుచుకోవద్దని చేతులెత్తి ప్రార్థిస్తున్నానన్నారు.

తెలంగాణలోని పసుపు రైతులకు న్యాయం జరిగే విధంగా తాము ముందుకు సాగుతామన్నారు. తమకు అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారని, చాలామంది నాయకులు కష్టపడి పార్టీ కోసం పని చేశారని, కానీ పొత్తులో భాగంగా కొన్ని సీట్లు కోల్పోయినప్పుడు బాధ ఉండటం సహజమేనని అసంతృప్తులను ఉద్దేశించి అన్నారు. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన ఎన్డీయేలో భాగస్వామి అని అందుకే కొన్ని స్థానాలు కోల్పోవడం తప్పదన్నారు. అయితే అలాంటి నేతలకు పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. వారికి నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం ఇస్తామన్నారు. జనసేనతో పొత్తుతో ప్రయోజనమా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా పరస్పరం లాభం ఉంటేనే పొత్తులు ఉంటాయన్నారు. పవన్ కల్యాణ్ మద్దతు తమకు ఉందన్నారు.

దేశవ్యాప్తంగా 163 మంది బీసీలను బీజేపీ ఎమ్మెల్సీలుగా చేసిందని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... దేశ ప్రజలు ప్రధాని నరేంద్రమోదీ వైపు చూస్తున్నారన్నారు. రాహుల్ గాంధీకి బీసీలంటే చిన్నచూపు ఎందుకు? అని ప్రశ్నించారు. బీసీలకు హామీనిచ్చి సీఎం కేసీఆర్‌ మాట తప్పారన్నారు. కాంగ్రెస్, భారాస రెండూ బీసీల వ్యతిరేక పార్టీలే అన్నారు. బీజేపీ రాబోయే జాబితాలో బీసీలకు అధిక స్థానాలు కేటాయిస్తామన్నారు. బీసీల ఆత్మగౌరవం కాపాడే పార్టీ బీజేపీయే అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో సముచిత స్థానం కల్పిస్తోంది బీజేపీయే అన్నారు.


More Telugu News