రేపు లేదా ఎల్లుండి మిగతా అభ్యర్థుల జాబితా: కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ

  • నేను ఏ స్థానం నుంచి పోటీ చేసేది పార్టీ సీఈసీ నిర్ణయిస్తుందన్న షబ్బీర్ అలీ
  • ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఆరు గ్యారెంటీలు విడుదల చేశామని వివరణ 
  • త్వరలో బీసీ, మైనార్టీ డిక్లరేషన్ విడుదల చేస్తామని వెల్లడి
తెలంగాణలో మిగిలిన అభ్యర్థుల జాబితా రేపు లేదా ఎల్లుండి వస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తెలిపారు. కాంగ్రెస్ మొదటి విడతలో 55 మంది, రెండో విడతలో 45 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. మొత్తం 100 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. మరో 19 నియోజకవర్గాల్లో ప్రకటించాల్సి ఉంది. అయితే ఇందులో కమ్యూనిస్ట్ పార్టీలకు కేటాయించే స్థానాలను మినహాయించి ప్రకటించవలసి ఉంటుంది.

బుధవారం షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఏ స్థానం నుంచి పోటీ చేయాలనేది తమ పార్టీ సీఈసీ నిర్ణయిస్తుందన్నారు. ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇప్పటికే రైతు డిక్లరేషన్, ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్, సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలను విడుదల చేశారన్నారు. త్వరలో మైనార్టీ, బీసీ డిక్లరేషన్‌ను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేతుల మీదుగా విడుదల చేస్తామన్నారు.

రూ.5వేల కోట్లతో మైనార్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామన్నారు. ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశంపై న్యాయపరంగా ముందుకు వెళ్తామన్నారు. అలాగే నాలుగు శాతం రిజర్వేషన్లకు పార్టీ రక్షణ కల్పిస్తుందన్నారు. మైనార్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు.


More Telugu News