సెమీఫైనల్స్.. ఏ జట్టుకున్న అవకాశాలు ఏంటంటే..!

  • బంగ్లాదేశ్ మినహా మిగతా జట్లకు ఇప్పటికీ ఛాన్స్
  • పాయింట్లతో పాటు నెట్ రన్ రేట్ కూడా కీలకమే
  • తొమ్మిది జట్లకున్న అవకాశాలపై క్రీడా పండితుల విశ్లేషణ
వన్డే వరల్డ్ కప్ లో గ్రూప్స్ సమరం సగం పూర్తయింది. అయితే, సెమీస్ కు చేరే జట్లపై ఇంకా స్పష్టత రాలేదని క్రీడా పండితులు చెబుతున్నారు. ఒక్క బంగ్లాదేశ్ కు మాత్రమే సెమీస్ దారులు మూసుకుపోయాయని, మిగతా తొమ్మిది జట్లకు సెమీస్ అవకాశాలు పూర్తిగా సన్నగిల్లలేదని అంటున్నారు. మొత్తం పది జట్లలో నుంచి కేవలం నాలుగు మాత్రమే సెమీస్ లోకి ఎంటర్ కానుండగా.. ఆ జట్లు ఏవనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోందని తెలిపారు. ఈ క్రమంలో తొమ్మిది జట్లలో ఏ జట్టు అవకాశాలు ఎలా ఉన్నాయనేది చూస్తే..

ఇండియా..
ఇప్పటి వరకు ఆడిన ప్రతీ మ్యాచ్ లోనూ గెలిచిన ఇండియా పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది. పన్నెండు పాయింట్లతో ఉన్న భారత జట్టుకు సెమీస్ కు చేరాలంటే మరో పాయింట్ అవసరం. ఈ క్రమంలో ఇకపై తలపడే మ్యాచ్ లలో ఏ ఒక్క మ్యాచ్ ను గెలిచినా, టై చేసుకున్నా రోహిత్ సేన సెమీ ఫైనల్ లో అడుగు పెడుతుంది. అంటే, భారత జట్టుకు దాదాపుగా బెర్త్ ఖరారైనట్లేనని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

సౌతాఫ్రికా..
ఇప్పటికి ఆరు మ్యాచ్ లు ఆడి ఒక్క మ్యాచ్ లో ఓటమి పాలైన సౌతాఫ్రికాకు సెమీస్ బెర్త్ కోసం మరో మూడు పాయింట్లు అవసరం. గ్రూప్ దశలో ఆ జట్టు ముందున్న మ్యాచ్ లు కూడా మూడే.. అయితే, ప్రతీ మ్యాచ్ లోనూ బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నెట్ రన్ రేట్ లో టాప్ లో ఉన్న సౌతాఫ్రికాను మరొక్క విజయం వరించినా సెమీస్ లోకి అడుగుపెడుతుంది.

న్యూజిలాండ్..
పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ జట్టుకు సెమీస్ బెర్త్ దక్కాలంటే ఇంకో రెండు విజయాలు నమోదు చేయాల్సిందే. గ్రూప్ దశలో మరో మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. బుధవారం సౌతాఫ్రికాతో జరగనున్న మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా సెమీస్ పై ఆశలు పదిలం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్ లో కనుక న్యూజిలాండ్ ఓడిపోతే ఆ తర్వాతి రెండు మ్యాచ్ లలో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఆస్ట్రేలియా..
పాట్ కమిన్స్ సేన పరిస్థితి కూడా న్యూజిలాండ్ లానే ఉంది. ఆస్ట్రేలియా మరో మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ మూడింటిలో రెండు మ్యాచ్ లను తప్పకుండా గెలిస్తేనే సెమీస్ గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. నెట్ రన్ రేట్ విషయంలో మెరుగ్గా ఉండడం ఈ జట్టుకు కలిసి వచ్చే అంశం.

ఆఫ్ఘనిస్థాన్..
వరల్డ్ కప్ లో దాదాపు గ్రూప్ దశ పూర్తికావస్తున్నా ఆఫ్ఘనిస్థాన్ జట్టు సెమీస్ బరిలో నిలవడం ఇదే తొలిసారి. శ్రీలంకపై సంచలన విజయం తర్వాత సెమీస్ ఆశలు నిలుపుకుందీ జట్టు.. ఇకపై ఆడాల్సిన మూడు మ్యాచ్ లలో గెలిస్తే ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు 12 పాయింట్లు వస్తాయి. ఏదైనా అద్భుతం జరిగితే సెమీస్ లో అడుగుపెట్టే అవకాశం లేకపోలేదు.

శ్రీలంక..
ఇప్పటి వరకు నమోదైన గణాంకాలను చూస్తే శ్రీలంక జట్టుకు సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ జట్టు సంపాదించిన పాయింట్లు 4 కాగా ఆడాల్సిన మ్యాచ్ లు మరో మూడు ఉన్నాయి. ఆ మూడింటిలో గెలిస్తే శ్రీలంక ఖాతాలో మొత్తం పది పాయింట్లు చేరతాయి. అయినా సరే సెమీస్ కు అర్హత సాధించలేదు. అయితే, మిగతా జట్లు కూడా పది పాయింట్లలోపే గ్రూప్ దశను పూర్తిచేస్తే, నెట్ రన్ రేట్ ద్వారా శ్రీలంక సెమీస్ కు చేరే అవకాశం ఉంది. టెక్నికల్ గా శ్రీలంక ఇంకా సెమీస్ బరిలో ఉంది.

పాకిస్థాన్..
ఏడు మ్యాచ్ లు ఆడాక పాక్ సాధించిన పాయింట్లు కేవలం 6.. మిగతా రెండు మ్యాచ్ లు గెలిస్తే ఇంకో నాలుగు పాయింట్లు చేరి మొత్తం 10 పాయింట్లు. టోర్నీలో మిగతా జట్ల గెలుపు ఓటములు, నెట్ రన్ రేట్ ఆధారంగా పాకిస్థాన్ కూడా సెమీస్ లో అడుగుపెట్టే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు.

నెదర్లాండ్స్..
నాలుగు పాయింట్లతో ఉన్న నెదర్లాండ్స్ జట్టు గ్రూప్ దశలో మరో మూడు జట్లతో తలపడాల్సి ఉంది. ఆ మూడింటిలో నెగ్గితే మొత్తం పది పాయింట్లతో సెమీస్ రేసులో నిలుస్తుంది.

బంగ్లాదేశ్..
ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్ లలో కేవలం ఒక్క మ్యాచ్ లో గెలిచిన బంగ్లాదేశ్ జట్టు ఏ అద్భుతం జరిగినా సెమీస్ లో అడుగుపెట్టే అవకాశమే లేదు. ఈ మెగా టోర్నీ నుంచి వైదొలిగిన మొదటి జట్టు బంగ్లాదేశ్. ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే ఈ జట్టులోని ఆటగాళ్లు రిటర్న్ టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నారు.

ఇంగ్లాండ్..
ఆడింది ఆరు మ్యాచ్ లు.. అందులో గెలిచింది ఒకే ఒక్కటి. దీంతో డిపెండింగ్ ఛాంపియన్ ఖాతాలో కేవలం రెండు పాయింట్లు మాత్రమే చేరాయి. నెట్ రన్ రేట్ విషయంలోనూ వెనుకంజలోనే ఉందీ జట్టు. ఫలితంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. అయినప్పటికీ ఇంగ్లాండ్ కు సెమీస్ దారులు పూర్తిగా మూసుకుపోలేదు. ఇకపై ఆడాల్సిన మూడు మ్యాచ్ లలో (ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్ జట్లతో) ప్రత్యర్థి జట్లను చిత్తుగా ఓడిస్తే మెరుగైన రన్ రేట్ తో సెమీస్ రేసులో నిలబడవచ్చు. మిగతా జట్ల గెలుపోటములు కూడా ఇంగ్లాండ్ సెమీస్ అవకాశాలను ప్రభావితం చేయనున్నాయి.



More Telugu News