వన్డేల్లో సచిన్ సెంచరీల రికార్డుకు చేరువవ్వడంపై తొలిసారి స్పందించిన విరాట్ కోహ్లీ

  • సచిన్ 49 సెంచరీలు చేయగా,  కోహ్లీ 48 సెంచరీలు చేసిన వైనం  
  • ఇన్ని రికార్డులు సాధిస్తానని ఎప్పుడూ అనుకోలేదని వ్యాఖ్య
  • అంతా అనుకున్నట్టే కచ్చితంగా జరగాలని భావించలేదని వెల్లడి
క్రికెట్‌లో ఇన్ని రికార్డులు సాధిస్తానని  తాను ఎప్పుడూ అనుకోలేదని ‘పరుగుల యంత్రం’ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. సుదీర్ఘకాల కెరీర్, గొప్ప ఆటతీరు, ప్రస్తుతం తన స్థితి అంతా ఆశీర్వచనమని పేర్కొన్నాడు. వన్డేల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలకు చేరువైన నేపథ్యంలో ‘స్టార్ స్పోర్ట్స్‌తో కోహ్లీ మాట్లాడాడు. ‘ ఇది సాధించగలనని కలలు కన్నాను. కానీ అంతా అనుకున్నట్టే కచ్చితంగా జరగాలని నేనెప్పుడూ భావించలేదు. కొనసాగుతున్న ప్రయాణం, సాధించిన రికార్డులు అన్నింటినీ ఎవరూ ప్లాన్ చేయరు. గడిచిన 12 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఇన్ని సెంచరీలు, ఇన్ని పరుగులు చేస్తానని నేను అనుకోలేదు’’ అని విరాట్ కోహ్లీ చెప్పాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్ కోహ్లీ ఇప్పటివరకు మొత్తం 78 సెంచరీలు కొట్టాడు. అత్యంత నైపుణ్యంగా, నిలకడగా ఆడుతూ ప్రపంచ క్రికెట్ దిగ్గజాల సరసన నిలుస్తున్నాడు.

కాగా కింగ్ విరాట్ కోహ్లీ వన్డేల్లో తన 49వ సెంచరీ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రపంచ కప్ 2023లో భాగంగా గురువారం శ్రీలంకతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ కొడితే సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డ్‌ 49 వన్డే సెంచరీలను సమం చేయనున్నాడు. ఈ వరల్డ్ కప్‌లోనే 50 వన్డే సెంచరీలు చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇలా జరిగితే వన్డేల్లో 50 సెంచరీల మొనగాడిగా కోహ్లీ నిలవబోతున్నాడు. 

నిజానికి ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లోనే కోహ్లీ సచిన్ రికార్డును సమం చేస్తాడని అంతా భావించారు. కానీ దురదృష్టవశాత్తూ 95 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో సెంచరీ చేజారింది. దీంతో శ్రీలంకపై కోహ్లీ సెంచరీ నమోదు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇదివుండగా భారత్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. 6 ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ, 3 అర్ధసెంచరీలతో మొత్తం 354 పరుగులు నమోదు చేశాడు.


More Telugu News