అమెరికాలో తెలంగాణ విద్యార్థి వరుణ్‌రాజ్‌పై కత్తితో దాడి.. పరిస్థితి విషమం

  • వల్పారైసో నగరంలో ఘటన
  • బతికే చాన్స్ ఐదుశాతం లోపేనన్న వైద్యులు
  • అవసరమైన సాయం అందిస్తామన్న మంత్రి కేటీఆర్
అమెరికాలో వరుణ్ రాజ్ పుచ్చా అనే 24 ఏళ్ల తెలంగాణ విద్యార్థిపై దాడి జరిగింది. జిమ్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి అతడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వరుణ్ ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇండియానా రాష్ట్రంలోని వల్పారైసో నగరంలో ఆదివారం ఉదయం జరిగిందీ ఘటన. కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. 

నిందితుడు జోర్డాన్ అండ్రాడ్ (24)ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ప్రాణాలు తీసే ఆయుధాన్ని కలిగి ఉండడం, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. వరుణ్ ప్రస్తుతం ఫోర్ట్ వేన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, తీవ్రంగా గాయపడడంతో అతడు బతికే అవకాశాలు ఐదుశాతం లోపేనని నివేదికలు చెబుతున్నాయి. 

నిందితుడు జోర్డాన్ మాట్లాడుతూ.. తాను ఆ రోజు ఉదయం మసాజ్ కోసం గదిలోకి వెళ్లానని, అక్కడ తనకు తెలియని కొత్త వ్యక్తి కనిపించాడని తెలిపాడు. అతడు కొంచెం అసహజంగా, ముప్పుగా కనిపించడంతో ప్రతిస్పందించకతప్పలేదని పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. 

వల్పారైసో యూనివర్సిటీలో చదువుతున్న వరుణ్‌రాజ్ దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న విషయం తెలిసిన మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. భారత రాయబార కార్యాలయం, అక్కడనున్న తెలంగాణ ఎన్నారైల మద్దతుతో వరుణ్‌కు అవసరమైన సాయం అందిస్తామని ఎక్స్ ద్వారా హామీ ఇచ్చారు.


More Telugu News